నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో వయస్సు మేరకు బోగస్ బోనఫైడ్‌‌‌‌‌‌‌‌లు

వనపర్తి టౌన్, వెలుగు: ఎడ్యుకేషన్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేరొందిన వనపర్తి జిల్లా గురుకుల సీట్ల దందాకు అడ్డాగా మారింది.  తమ పిల్లలను గురుకులాల్లో జాయిన్ చేద్దామనుకుంటున్న నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బుల కోసం వాడుకుంటున్నారు.  కోచింగ్ పేరిట వారి నుంచి  వేల రూపాయలు వసూలు చేయడమే కాదు..  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన మేరకు విద్యార్థుల వయస్సు ఉండేలా  బోగస్ బోనఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తయారు చేస్తున్నారు.  ఇందుకోసం విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ డేటాను కూడా మారుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.    

పేరుకే స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. నడిపేది కోచింగ్ సెంటర్

వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ స్కూళ్ల పేరుతో అనుమతులు తీసుకొని వాటి స్థానంలో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు నిర్వహిస్తున్నారు.  1 నుంచి 7 తరగతుల వరకు స్కూల్ నడుపుతున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నా..  గురుకుల కోచింగ్  అవసరం ఉన్న 5, 6, 7 తరగతుల స్టూడెంట్లను మాత్రమే అక్కడ ఉంచుకుంటున్నారు.  గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ తదితర పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రకారం వయస్సు లేకున్నా.. ఎక్కువ ఉన్నా..  బోనఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టిన తేదీలు మార్చి అప్లై చేయిస్తున్నారు.  ఇందుకోసం రెండు రికార్డులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఒక రికార్డు చూపించి..  మరొక రికార్డులో మార్పు, చేర్పులను పెన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాసుకొని బోగస్ బోనఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సృష్టిస్తున్నట్లు సమాచారం.  

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టకుండానే

గతంలో చదివిన స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా.. తమ వద్దే అన్ని తరగతులు చదివినట్లు బోగస్ రికార్డులు సృష్టిస్తున్నారు.  గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక విద్యార్థి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందినా విద్యాశాఖ యూడైస్  వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.  ఒకవేళ విద్యార్థి మరో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాలనుకుంటే ప్రీవియస్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ పెట్టి వారి అనుమతితోనే మారాలి. ఇవేమీ చేయకుండా ఎంఈవో కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై తమ వద్దే చదువుతున్నట్లు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పర్మిషన్ తీసుకుంటున్నారు.  ఈ మేరకు ఎంఈవో లాగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ చేస్తున్నారు.  అప్పటికే ఉన్న స్టూడెంట్ వివరాలు క్లోజ్ చేస్తున్నారు.  ఇందుకోసం ఎంఐసీ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్లు, డీఈవో కార్యాలయం సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.. 

జిల్లాలో బోగస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోనఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వ్యవహారానికి సంబంధించి పలు  ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లపై ఫిర్యాదులు అందుతున్న డీఈవో చర్యలు తీసుకోవడం లేదు.  తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.  ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం గార్లపాడుకు స్టూడెంట్ల విషయంలో పెబ్బేరు ఎంఈవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి  డబ్బులు తీసుకొని ఎంఈవో లాగిన్ ద్వారా పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు.

విచారణ చేసిచర్యలు తీసుకుంటం

పెబ్బేరుకు చెందిన రెండు ప్రైవేట్ స్కూళ్లు రూల్స్ కు విరుద్ధంగా యూడైస్ లో డేటాను మార్చినట్లు గద్వాల జిల్లా ధరూర్ మండలం ఎంపీహెచ్ ఎస్ గార్లపాడు స్కూల్ హెచ్ఎం ఫిర్యాదు చేశారు.  ఈ ఇష్యూపై ఎంక్వైరీ చేయాలని పెబ్బేరు ఎంఈవోకు ఆదేశాలు  ఇచ్చాం. పూర్తి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  రూల్స్ పాటించని ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్లపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. - రవీందర్, డీఈవో, వనపర్తి 

గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడు ఎంపీహెచ్ఎస్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో చదువుతున్న నలుగురు స్టూడెంట్లకు సంబంధించి ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ పెట్టకుండానే పెబ్బేరులో సరస్వతి విద్యానికేతన్, శ్రీ విజ్ఞాన్ హైస్కూల్ వాళ్లకు ఎంఈవో సిబ్బంది ఆన్ లైన్‌‌‌‌‌‌‌‌ డేటాకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. దీనిపై  గద్వాల డీఈవో  16.11.2022 న వనపర్తి డీఈవోకు ఫిర్యాదు చేశారు.  అకాడమిక్ ఇయర్ వారి వద్దే చదివినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కొత్తకోట మండల కేంద్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌జీ కాన్సెప్ట్ స్కూల్ పేరుతో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకొని అనుమతులు లేకుండా జీటీ నారాయణ పేరిట కోచింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుపుతున్నట్లు గ్రాడ్యుయేషన్ అన్‌‌‌‌‌‌‌‌ఎంప్లాయిస్ అసోషియేషన్ మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ  భరత్ కుమార్  వనపర్తి డీఈవోకు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఎం.గణేష్ అనే స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు ఒకే అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4, 6, 7 తరగతులు చదివినట్లు పుట్టిన తేదీలు మార్చి మూడు బోనఫైడ్ ఇచ్చారు.