సీఎంఆర్​ బకాయిల్లో టాప్​ ఫైవ్​లో​వనపర్తి జిల్లా

సీఎంఆర్​ బకాయిల్లో టాప్​ ఫైవ్​లో​వనపర్తి జిల్లా
  • మిల్లర్లకు సహకరించిన ఇంటి దొంగలు

వనపర్తి, వెలుగు:కస్టం మిల్లింగ్​ రైస్​ బకాయిల్లో రాష్ట్రంలో వనపర్తి జిల్లా టాప్​ ఫైవ్​లో ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను రైస్​ మిల్లులకు అప్పగిస్తే వాటిని మిల్లుల్లో ఆడించి ఇవ్వకుండా పక్కదారి పట్టించారు. 2021–-22 వానాకాలం, యాసంగి కాలాల నుంచి 2023-–24 వరకు ఆరు కాలాలకు సంబంధించి 2,06,761 మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. 

ఇంత పెద్ద మొత్తంలో  సీఎంఆర్​ బకాయి ఉండడం ఏమిటని అంటున్నారు. వనపర్తి జిల్లా టాప్​ ఫైవ్​లో ఉండవచ్చని సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లే చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మిల్లర్లు బియ్యం ఇవ్వాల్సి ఉన్నా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వం మిల్లర్లకు ఇచ్చే క్వింటాల్​ వడ్లను మిల్లింగ్​ చేసి 67 కిలోల బియ్యం ఇవ్వాలి. అలా మిల్లింగ్​ చేసినందుకు గవర్నమెంట్​ మిల్లింగ్​ చార్జీలు ఇస్తుంది. 
 
వడ్లను పక్కదారి పట్టించి..

రేషన్​ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకోవడంతో మిల్లర్ల దృష్టి వీటిపై పడింది. గవర్నమెంట్​ ఇచ్చిన నాణ్యమైన వడ్లను కొందరు మిల్లర్లు పక్క స్టేట్​లకు అమ్ముకొని.. వాటి స్థానంలో రేషన్​ బియ్యాన్ని పాలిష్​ చేసి సీఎంఆర్​ కింద ఇస్తూ వచ్చారు. పక్క రాష్ట్రాలకు వడ్లు పంపి, మిల్లులో రేషన్​ బియ్యం నిల్వ చేసిన సందర్భాల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ దాడుల్లో అనేక సార్లు పట్టుబడ్డాయి. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఇక సీఎంఆర్​ బకాయిలను నిర్దేశించిన గడువులోగా, ఇవ్వకుంటే నూటికి 125 శాతం వసూలు చేయాలన్న ఆదేశాలు కూడా మూలనపడ్డాయి. దీంతో బకాయిలు చెల్లించాలన్న ఉద్దేశం మిల్లర్లలో కనిపించడంలేదు.

85మిల్లులు డిఫాల్ట్..

జిల్లాలో 110 దాకా రైస్​ మిల్లులు ఉన్నాయి. వాటిలో 85 మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలారని సివిల్​ సప్లై ఆఫీసర్లు తెలిపారు. ఆగస్టు 23 వరకు సీఎంఆర్​ బకాయిలు ఇవ్వాలని, ఇదే ఆఖరు గడువుగా పేర్కొన్నారు. చివరకు కలెక్టర్​ ఆదేశాలతో 40 మంది మిల్లర్లపై ఆర్ఆర్​ యాక్ట్​ను అమలు చేస్తున్నారు. వీరికి నోటీసులు ఇచ్చి వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరు మిల్లర్ల ఆస్తులను జప్తు చేశారు. దీంతో రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేసి ఆస్తుల జప్తును ఆపాలని కోరగా, తప్పు చేసిన వారిని వెనుకేసుకు రావద్దంటూ కలెక్టర్​ మిల్లర్​ సంఘం నాయకులకు సూచించారు. 

ఇంటి దొంగల సహకారంతోనే..

జిల్లాలోని మిల్లర్లు సీఎంఆర్​ బియ్యాన్ని పక్కదారి పట్టించడం, పీడీఎస్​ రైస్​ను సీఎంఆర్​ పేరిట ఇవ్వడం వెనక జిల్లా సివిల్​ సప్లై ఆఫీస్​లోని ఇద్దరు కింది స్థాయి ఆఫీసర్లు కారణమనే ఆరోపణలున్నాయి. ఒక ఆఫీసర్​ ఏకంగా ఐదేండ్ల నుంచి జిల్లాలోనే పాతుకుపోయారు. ఇటీవల బదిలీలు జరిగినా ఆయన మారలేదు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా వనపర్తి జిల్లాలో రైస్​మిల్లర్లు రూ.వంద కోట్లకు పైగా బకాయిలుండడం ఏమిటనే ప్రశ్న వస్తోంది. ఏదైనా రైస్​ మిల్లులో  పీడీఎస్​ రైస్​ దొరికితే సివిల్​ సప్లై ఆఫీసర్లు దాడులు చేసి 6ఏ కింద కేసు నమోదు చేస్తారు. ఆ మిల్లును సీజ్​ చేసి బ్లాక్​ లిస్టులో పెట్టాలి. 

కానీ, ఓ ఆఫీసర్​ చలవతో అలా జరగడం లేదు. అదే మిల్లును ఒకరు లీజుకు తీసుకున్నట్లుగా ఓనరు బంధువుపేరు మీద లీజ్​ డీడ్​ తీయించి వడ్లు కేటాయించేలా చూస్తూ మిల్లర్లకు సహకరిస్తున్నాడు. అంతే కాకుండా ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్ల దాడుల సమాచారాన్ని కూడా మిల్లర్లకు ముందస్తుగా చేరవేసి వారికి అండగా ఉంటున్నాడని కొందరు మిల్లర్లే చెబుతున్నారు. సీఎంఆర్​ విషయంలో ప్రభుత్వం, కలెక్టర్​ సీరియస్​గా ఉండడంతో మిల్లర్లు సీఎంఆర్​ క్లియర్​ చేసే విషయంలో ఆందోళనకు గురవుతుండగా, మరింత మందిపై ఆర్ఆర్​ యాక్ట్  ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.