వనపర్తి, వెలుగు: గోపాల్పేట మండలం బుద్ధారం గండి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చుతామని, ఇప్పటికే బుద్ధారం గండిలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం భూ సర్వే పూర్తయిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం గండి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి ఆంజనేయస్వామి ఆలయం రానున్న కాలంలో టూరిజం హబ్ గా మారబోతుందని, పర్యాటక శాఖ నుంచి ఇప్పటికే రూ.2 కోట్లకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలోనే హరిత హోటల్ నిర్మాణానికి భూమిపూజ చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు వనపర్తి మండలం రాజనగరం, రాజపేట కెనాల్‌ను పరిశీలించి 15 రోజుల వరకు నీటిని వదలాలని ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచించారు. మున్సిపల్ చైర్మన్ మహేశ్, గోపాల్పేట, రేవల్లి మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.