హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలో ఉన్న శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్ మరియు హోటల్ మూసివేతకు సీపీ సుధీర్ బాబు ఆదేశాలిచ్చారు. వనస్థలిపురంలోని ఇదే హోటల్లో ఇటీవల యువతి అత్యాచార ఘటన జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పగలు, రాత్రి తేడా లేకుండా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి ఫ్రూఫ్స్ అడగకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.
చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించి పరోక్షముగా రేప్కి కారణమై, స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు. ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారం చేసిన ఘటన ఈ హోటల్ గదిలోనే జరిగింది. సంతోషంలో పార్టీ ఇచ్చిన ఆమెను మద్యం తాగించి రేప్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ యువతి (24) కి ఇటీవల ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. హయత్ నగర్ లెక్చరర్ కాలనీకి చెందిన ఎడ్ల గౌతమ్ రెడ్డి (26).. బాధితురాలికి స్కూల్ మేట్. ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని యువతిని అతను ఒత్తిడి చేశాడు.
ఇందుకు యువతి అంగీకరించింది. సోమవారం సాయంత్రం స్నేహితుడికి పార్టీ ఇవ్వడానికి వనస్థలిపురానికి వచ్చింది. ఇద్దరూ కలిసి ఓంకార్ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. రెస్టారెంట్‌లో గౌతమ్ రెడ్డి మద్యం తాగాడు. యువతికి కూడా బలవంతంగా మద్యం తాగించాడు. తరువాత రెస్టారెంట్ కింద ఉన్న హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు. బాధితురాలు అప్పటికే మత్తులో ఉంది. ఇదే అదునుగా ఆమెపై గౌతమ్ అత్యాచారం చేశాడు. అప్పటికే ఆ గదిలో గౌతమ్ రెడ్డి స్నేహితుడు మునగాల శివాజీ రెడ్డి (30) అలియాస్ చింటూ రెడ్డి ఉన్నాడు. అతను కూడా యువతిపై అత్యాచారం చేశాడు.
బాధితురాలి అరుపుతో పారిపోయిన నిందితులు
ఇద్దరు అత్యాచారం జరపడంతో యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. స్పృహ నుంచి తేరుకున్న బాధితురాలు ఇద్దరిని చూసి కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది గదికి రావడంతో గౌతమ్ రెడ్డి, శివాజీ రెడ్డి పారిపోయారు. బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. గౌతమ్ రెడ్డి, శివాజి రెడ్డిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.