లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలో వందేభారత్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగులు పట్టాల మధ్యలో బైక్ అడ్డు పెట్టగా.. వేగంగా దూసుకెళ్లిన ట్రైన్ బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. రైలు వారణాసి నుండి ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లోకో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం (నవంబర్ 8) సాయంత్రం ఝాన్సీ స్టేషన్ సమీపంలోని బంద్వా తాహిర్‌పూర్ రైల్వే అండర్‌పాస్‌పై కొంతమంది యువకులు బైక్‌లతో రైల్వే ట్రాక్‌ను దాటుతున్నారు.
ఇదే సమయంలో వందేభారత్ రైలు ఆ మార్గంలో వస్తుండటంతో భయాందోళనకు గురైన యువకులు బైక్‌ను పట్టాలపైనే వదిలి పారిపోయారు. దీంతో పట్టాలపై ఉన్న బైక్‌ను వందే భారత్ బలంగా ఢీకొట్టి.. కొంతదూరంగా లాక్కెళ్లింది. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. అనంతరం వారణాసిలోని ఈశాన్య రైల్వే కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో వందే భారత్ ట్రైన్ పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టాలపై బైక్ వదిలేసి పారిపోయిన యువకుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.