'వందే భారత్​'పై పెరిగిన ఆశలు..

  • ఇప్పటికే ట్రయల్​ రన్​ పూర్తి చేసిన  రైల్వే ఆఫీసర్లు
  • మంచిర్యాలలో హాల్టింగ్​కు వివేక్​ వెంకటస్వామి వినతి

కోల్​బెల్ట్​,వెలుగ : సికింద్రాబాద్ నుంచి నాగ్​పూర్ మధ్య వందేభారత్​ రైలు నడిపించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది.   ఈ  రైలు ప్రవేశపెట్టడం ద్వారా మహారాష్ట్ర, -తెలంగాణ రాష్ట్రాల మధ్య దాదాపు 4 గంటల సమయం ఆదా కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్​ జిల్లాల ప్రయాణికులకు కలిసిరానుంది. వందే భారత్ రైలు షెడ్యూల్​ కోసం ప్రయాణికులు రెండు నెలలుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రైల్వే శాఖ ట్రయల్​ రన్​ కూడా పూర్తి చేసింది. వందేభారత్​ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్​ కల్పించాలని గురువారం పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు డాక్టర్​ గడ్డం వివేక్​వెంకటస్వామి ఢిల్లీలో కేంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.  దీంతో వందే భారత్ రైలు ఏర్పాటుపై పూర్తిస్థాయిలో ఆశలు పెరిగాయి. 

 580 కి.మీ. దూరం

సికింద్రాబాద్​ నుంచి నాగ్​పూర్​మధ్య సుమారు 580 కి.మీ దూరం రైల్వే మార్గం ఉంది. ఈ మార్గంలో సుమారు 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్ జిల్లాలను కలుపుతూ ఈ మార్గం ఉంది. ప్రస్తుతం గరిష్ఠంగా 10 గంటల సమయం పడుతుంది.  వందే భారత్​ రైలు అందుబాటులోకి వస్తే 6 గంటల్లోనే గమ్య స్థానికి చేరుకునే ఛాన్స్​ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే ఏ స్టేషన్​లోనూ వందేభారత్​ రైలును ఆపకుండా ట్రయల్ రన్ పూర్తి చేశారు.  రైలు రాకపోకల షెడ్యూల్​ను అధికారికంగా దక్షిణమధ్య రైల్వే ఆఫీసర్లు ప్రకటించాల్సి ఉంది. సుమారు రెండు నెలలుగా ప్రయాణికులు రైలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

హాల్టింగ్​లపై తర్జనభర్జన

సికింద్రాబాద్,​-నాగ్​పూర్​ మధ్య వందేభారత్​ రైలు ప్రవేశపెడితే ఏయే స్టేషన్లలో హాల్టింగ్​ కల్పిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్​ జిల్లాల ప్రజలు సికింద్రాబాద్​కు వెళ్లడానికి అనుకూలంగా ఉండనుంది. వ్యాపార అవసరాల కోసం మంచిర్యాల, రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్, హైదారాబాద్​కు మహారాష్ట్ర, నాగ్​పూర్, బల్లార్షా వాసులు రాకపోకలు సాగించేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని వర్గాలకే రైలు సేవలు అందుబాటులో ఉన్నప్పటికి ప్రయాణ సమయం ఆదా కానుంది. కాజీపేట, పెద్దపల్లి,  రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి,  సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షాకు రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లుగా గుర్తింపు ఉంది.  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌  రైలు సేవల కోసం స్థానిక ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. .