వందే భారత్ రైళ్లలోనూ అదే తంతు.. సాంబార్‌లో పురుగులు

వందే భారత్ రైళ్లలోనూ అదే తంతు.. సాంబార్‌లో పురుగులు

దేశ ర‌వాణా వ్యవ‌స్థలో భార‌తీయ రైల్వేశాఖ కీల‌క‌పాత్ర పోషిస్తున్న విషయం విధితమే. ప్రతిరోజూ ల‌క్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో రాక‌పోక‌లు సాగిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ స‌రికొత్త రైళ్లను ప్రవేశ‌పెడుతోంది. వందే భార‌త్, అమృత్ భార‌త్ అంటూ అధునాతన రైళ్లను తీసుకొస్తోంది. ఈ ప్రవేశపెట్టడాలు బాగానే ఉన్నప్పటికీ, ప్రయాణికుల సౌక‌ర్యాల విషయంలో రైల్వేశాఖ విఫలమవుతోంది. 

రైళ్లలో సరఫరా చేసే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, చచ్చిన ఎలుకలు దర్శనమిచ్చిన ఘటనలు కోకొల్లలు. తాజాగా, అలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. కాకపోతే, ఈసారి అధునాతన వందే భారత్ రైళ్లలో ఈ ఘటన జరగడం గమనార్హం. తిరునెల్వేలి నుంచి చెన్నై వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20666) రైలులో ఓ ప్రయాణికుడికి వడ్డించిన సాంబార్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమయింది. ఈ దెబ్బతో, సదరు రైలులోని ప్రయాణికులంతా అల్పాహారం లేకుండానే ప్రయాణం సాగించారు.

రూ.50వేల జరిమానా

వీడియో వైరల్ అవ్వడంతో రైల్వే శాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పడంతోపాటు సదరు ఆహారాన్ని అందించిన లైసెన్స్‌దారుకు రూ.50,000 జరిమానా విధించింది.