వందేభారత్ రైళ్లను ఆదరణ పెరుగుతోంది. కేంద్ర బడ్జెట్ లోనూ రైల్వే శాఖ ప్రతిపాదనల్లో ఈ రైళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రయాణం ఇప్పుడు మరింత సౌకర్యంగా ఉండబోతోంది. త్వరలో ఈ రైళ్లలో స్లీపర్ కోచ్ లు ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది.
వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం సీటింగ్ మాత్రమే ఉంది. 10 గంటల పాటు కూర్చొని ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంటుందని భావించిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్ లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ స్లీపర్ కోచ్ ల తయారీ 2025 జూన్ లోప్రారంభమై.. 2025 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చి 2026లో తిరిగి ట్రాక్‌పై పరుగులు పెడతాయని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.
వందేభారత్ రైళ్ల స్లీపర్ కోచ్ లు... టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (TRSL) ఉత్తర్ పరా ప్లాంట్‌లో తయారుకానున్నాయి. 80 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌తో టై- అప్‌కు రైల్వే శాఖ అప్పగించినట్లు టీఆర్‌ఎస్‌ఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటికి సంబంధించి 50-55 శాతం విడిభాగాల తయారీ బెంగాల్ ప్లాంట్‌లో జరుగుతుంది. టిటాగర్ రైల్ సిస్టమ్స్ లిమిటెడ్ (TRSL) ఉత్తర్‌పరా ప్లాంట్ ప్రభుత్వంతో టై-అప్‌లో 52 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో టీఆర్‌ఎస్‌ఎల్ వాటా దాదాపు రూ.12 వేల 716 కోట్లు అని కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ చౌదరి తెలిపారు. వందేభారత్ స్లీపర్ ట్రైన్ తొలి నమూనాను రెండేళ్లలో సిద్ధం చేస్తామన్నారు. మొదటి ఎనిమిది రైళ్లు ఉత్తర్‌పరా ప్లాంట్‌లో పూర్తిగా నిర్మించబడతాయి, మిగిలిన రైళ్లు చెన్నై ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడతాయన్నారు.
16 కోచ్ లు ...887 మంది ప్రయాణికులు
వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే విధంగా తయారు చేస్తున్నారు. వీటిలో 16 కోచ్ లు .. మొత్తం 887 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ & రష్యన్ కంపెనీ టిఎంహెచ్‌తో కూడిన మరో టై-అప్ చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ చౌదరి తెలిపారు.