ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర ఉద్యమం : కొలనుపాక కుమారస్వామి

బెంగాల్లో1905లో ప్రారంభమైన వందేమాతర ఉద్యమం హైదరాబాద్ కు విస్తరించింది. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో వందేమాతరం గీతాన్ని పాడకూడదని, తెలుపు చొక్కా, దోతి ధరించ వద్దని, పైజామా, నీలి రంగు షేర్వానీ మాత్రమే ధరించాలని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గక పోవడంతో ఓయూతో పాటు పలు విద్యా సంస్థల నుంచి వందలాది మంది విద్యార్థులను1938 డిసెంబర్12న  బహిష్కరించారు. ఓయూ ‘బీ’ హాస్టల్ విద్యార్థులు నిజాం ప్రభుత్వం, వర్సిటీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా1938లో ఉద్యమం చేపట్టారు. దసరా సందర్భంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్న వారిలో నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతారెడ్డి. పీవీ నర్సింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, హయగ్రీవాచారి, డి.వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం వంటి వారు ఎందరో ఉన్నారు. విద్యార్థుల ఉద్యమం ప్రజల్లో జాతీయ భావాలను నెలకొల్పింది. 

1,200 మంది స్టూడెంట్స్​తొలగింపు

వందేమాతరం జామే ఉస్మానియా నుంచి నగరంలో ఇతర విద్యాలయాలకు పాకింది. నగరంలోని విద్యాలయాలన్నీ వందేమాతరంతో ప్రతిధ్వనించాయి. ఈ ఉద్యమం క్రమంగా రాజ్యమంతటికి పాకింది. ప్రతి విద్యర్థి నోట వందేమాతరం మంత్ర జపం వినిపించింది. నిజాం బిత్తర పోయాడు. తనను చుట్టుకున్న అగ్నిని ఆర్పడానికి సర్వశక్తులొడ్డాడు. హాస్టల్ విద్యార్థులను ఖాళీ చేయించాలని ఫర్మానా విసిరాడు. విద్యార్థులు వినలేదు. హాస్టళ్లను వదలలేదు. మరింత ఆవేశంతో, ఉత్సాహంతో, ఉద్రేకంగా వందేమాతరం చదివారు. నిజాం పాలనలో వందేమాతరం ఉద్యమ వార్త భారతదేశంలో కార్చిచ్చులా పాకింది. గాంధీజీ స్పందించారు. వందేమాతరం చదివే హక్కు విద్యార్థులకు ఉంది అని అన్నారు. ‘లొంగకండి.. పోరాటం కొనసాగించండి.. ప్రభుత్వమే లొంగి వస్తుంది’ అని పిలుపునిచ్చారు. నిజాం ఉస్మానియాకు సాయుధ దళాలను రప్పించాడు. విద్యార్థులు వారి ముందే ‘వందేమాతరం’ ఆలపించారు. ప్రభుత్వానికి తోచలేదు. విశ్వవిద్యాలయం సహితంగా విద్యా సంస్థలన్నింటిని రాజ్య వ్యాప్తంగా మూసివేయించింది. ఉస్మానియా విద్యార్థులు క్యాంపస్ వదలలేదు. నినాదాలు మానలేదు. మరింత ఉత్సాహంతో ఉద్యమం సాగించారు. ‘క్షమాపణ చెప్పండి, లేకుంటే తొలగిస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ చెప్పకపోవడంతో నిజాం రాజు నిషేధాస్త్రం ప్రయోగించాడు. 1200 మంది విద్యార్థులను యూనివర్సిటీ నుంచి తొలగించాడు. అలా బయటకు వెళ్లిన విద్యార్థులు అడ్మిషన్​కోసం ఇతర యూనివర్సిటీలకు వెళ్లారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిజామాంధ్రులకు అడ్మిషన్స్​నిరాకరించింది. నాగపూర్ యూనివర్సిటీ ఓయూ స్టూడెంట్లకు స్థానం కల్పించింది. అక్కడ చదువుకొని వచ్చిన వారే తర్వాత నిజాం వ్యతిరేక సమరంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. వారిలో పీవీ నరసింహారావు ఒకరు. 1938 డిసెంబర్​12న ఓయూకు విస్తరించిన వందేమాతర ఉద్యమ స్ఫూర్తికి నేటితో 84 ఏండ్లు.

నిజాం గుండెల్లో పిడుగుల వర్షం

బ్రిటీష్​వారు మనదేశంలో కలకత్తాను రాజధానిగా చేసుకున్నారు. విప్లవ వాదం తొలిసారిగా బెంగాల్​లో మొదలు కావడానికి కారణం కూడా అదేనేమో! బెంగాల్​రచయితల్లో స్వాతంత్ర్య కాంక్ష పెల్లుబికింది. ‘వందేమాతరం’ గీతం దేశభక్తికి చిహ్నంగా, చైతన్యానికి గుర్తుగా, విప్లవానికి సంకేతంగా పరిణమించింది. ఆ స్ఫూర్తి నుంచే ఈ శతాబ్దపు ఆదిలో అనేక విప్లవోద్యమాలు రగులుకున్నాయి. ‘వందేమాతరం’ బ్రిటీష్​ ప్రభుత్వ గుండెల్లో తుపాకులు పేల్చింది. ఆంగ్లేయ ప్రభుత్వం ‘వందేమాతరం’ ఉద్యమాన్ని ఆర్ప డానికి తన బలాన్ని ప్రయోగించింది. అప్పుడు వందేమాతరం దావానలంలా మారింది.1938–-39లో వందేమాతరం చిచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో అంటుకుంది. అంతకు ముందు విద్యార్థులు వారి గదుల్లో వందేమాతరం పాడేవారు. అది ప్రభుత్వ దృష్టికి రాలేదు. తర్వాత హాస్టళ్లలో ఉమ్మడిగా వందేమాతరం ఆలపించారు. ఒక్కరోజు కాదు. ప్రతి రోజు ప్రార్థనలు చేశారు.  బెంగాల్​లో మాదిరిగా ‘వందేమాతరం’ నిజాం గుండెల్లో పిడుగుల వర్షం కురిపించింది. ‘వందేమాతరం’ పాడరాదని వెలువడిన ఉత్తర్వు ఉద్యమాన్ని మరింత రగిలించింది. 

- కొలనుపాక కుమారస్వామి 
సోషల్​ ఎనలిస్ట్​