![అనగనగా ఒక ఊరు : క్లీనెస్ట్ విలేజ్](https://static.v6velugu.com/uploads/2023/08/Vanghmun-is-a-very-clean-town-in-Tripura_9u0FxUhotz.jpg)
త్రిపురలో చాలా క్లీన్‌గా ఉండే ఊరు వంఘ్మన్. నార్త్ ఇండియాలోని చాలా గ్రామాలు ఈ ఊరిని పరిశుభ్రతకు చిరునామాగా చెప్పుకుంటారు. ‘ఉంటే ఆ ఊరిలా ఉండాలి’ అనుకుంటారు. అందుకు కారణం ఆ ఊరి ప్రజలే. వాళ్ల నిరంతర శ్రమకు ఫలితమే అందమైన, శుభ్రమైన ఊరు.
ఉత్తర త్రిపుర జిల్లాలోని జంపుయ్ కొండల మీద ఉంది ఈ గ్రామం. ఈ కొండలు చాలా ఎత్తులో ఉంటాయి. జంపుయ్ పర్వత శ్రేణిలో11 గ్రామాలు ఉన్నాయి. మిజో, లుషై తెగల వాళ్లు ఉంటారు ఇక్కడ. జంపుయ్ జనాభా దాదాపు15,000 కాగా వంఘ్మన్లో 250కి పైగా కుటుంబాలు ఉన్నాయి. అంటే ఆ ఊరి జనాభా దాదాపు పదిహేను వందలకు పైనే. మిజో తెగలలో ఎక్కువమంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. రిటైర్ అయినవాళ్లు నారింజ, పోకచెక్క(వక్క) వంటి పంటలు పండిస్తున్నారు. ఈ ఊళ్లో వాళ్లంతా రైతులే. ఇక్కడి వాళ్లందరికీ ఒక అలవాటు ఉంది.
జీవితం చక్కగా గడిచేందుకు ఎంత డబ్బు అవసరమో అంతే దాచుకుంటారు. ‘మాకు రిచ్‌గా బతకాలనే కోరికలు లేవు’ అంటారు వాళ్లు. చాలామంది గ్రామస్తులు క్రైస్తవాన్ని అనుసరిస్తుంటారు. ఇతర మతాలను గౌరవిస్తారు. స్కూల్, చర్చి, పబ్లిక్ ప్లేస్ల్లో పరిశుభ్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తుంటారు. అంతేకాదు.. ఈ ఊరి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల లెక్క చూస్తే ఇక్కడ క్రైమ్ రేటు తక్కువ.
మొదలైంది ఇలా...
రాజా బహదూర్ దొఖుమ సెయిలో అనే మిజో చీఫ్ 1919, ఫిబ్రవరి 5న పరిశుభ్రతను వాళ్ల కల్చర్‌లో భాగం చేశాడని చెప్తారు. ఆ తరువాత 1952– -58లో న్యూజిలాండ్‌కు చెందిన ఒక మిషనరీకి చెందిన మిస్ టుయిర్నర్ అనే మహిళ ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో గ్రామస్తులను మోటివేట్ చేసిందట. ఆ తర్వాత... యంగ్ మిజో అసోసియేషన్ మెంబర్స్ గ్రామాన్ని మనదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆ ఆశయంతో స్వయంగా గ్రామాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. పరిశుభ్రతపై అవగాహన క్యాంప్‌లు నిర్వహించారు. వాళ్లను చూసి గ్రామస్తులు ముందుకి వచ్చి వాళ్ల ఊరిని శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టారు.
చెత్త తీసుకెళ్లే వెహికల్‌కు ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు ఇస్తారు. గ్రామంలో రోడ్ల మీద చెత్త డబ్బాలు ఉంటాయి. పొడి, తడి చెత్త వేరువేరుగా ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నవంబర్ 25, 2019 నుంచి ఆ గ్రామంలో అన్ని రకాల ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేశారు. ప్లాస్టిక్‌కు బదులు పేపర్ బ్యాగ్‌లు వాడతారు. పేపర్ బ్యాగ్‌లను ఆ ఊరి మహిళలే తయారుచేస్తారు. ప్రతి శని, ఆదివారాలు గ్రామస్తులంతా కలిసి గ్రామాన్ని శుభ్రం చేసేందుకు ఒక దగ్గరకు చేరతారు. మామూలుగా అయితే చెత్త పారేసేందుకు ప్లాస్టిక్ డస్ట్‌బిన్ వాడుతుంటారు. వంఘ్మన్లో మాత్రం చెత్త వేసేందుకు వెదురుతో చేసిన చెత్తబుట్టల్ని వాడతారు. ఇవి ఆ ఊళ్లో ప్రతి మూలా కనిపిస్తాయి.
హైస్కూల్లో క్లాస్‌లు మొదలుపెట్టే ముందు పిల్లలు, టీచర్లు కలిసి స్కూల్ మొత్తం శుభ్రం చేస్తారు. సెలవు రోజుల్లో కూడా వారానికి రెండు లేదా మూడు సార్లు స్కూల్‌కి వెళ్లి శుభ్రం చేస్తుంటారట. వర్షం నీటిని పట్టి వాడుకోవచ్చు అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ, ఈ గ్రామ ప్రజలు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ప్రతి ఇంట్లో వర్షం నీళ్లు పట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ నీటిని వంటకు, స్నానానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు శుభ్రం చేయడానికి వాడతారు.
పశువులు ఉండవు
ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఏ గ్రామంలోకి వెళ్లినా పూలు, పండ్ల మొక్కలు, పెద్ద చెట్లతోపాటు పశువులు కూడా కనిపిస్తాయి. కానీ ఈ ఊళ్లో గొర్రె, మేక, ఆవు, దూడలాంటివి కనిపించవు. ఈ ఊళ్లో వాటికి ప్రవేశం లేదు. అలాగెందుకంటే ‘‘వాటిని ఊళ్లో ఉంచి పెంచితే చెత్త పోగవుతుంది. పైగా ఈగలు, దోమలు ఎక్కువవుతాయి. అందుకే వాటిని ఊరికి దూరంగా ఉంచడమే మేలంని ఊరి బయట పశువుల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాం. అక్కడే కోళ్లు, పందులు, మేకలు, ఆవులు.. వంటివన్నీ ఉంచుతాం” అని చెప్పారు. పరిశుభ్రతకు పెద్ద పీట వేసిన ఈ గ్రామ ప్రజలు ‘‘దేశం మొత్తంలో మాదే క్లీనెస్ట్ విలేజ్ అనిపించుకోవాలని ఉంది. అదే మా ఆశయం” అని చెప్తున్నారు.
- సెప్టెంబర్ 20, 2018న త్రిపుర ప్రభుత్వం వంఘ్మన్ని బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశంగా గుర్తించింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లోని అంశాలన్నింటినీ పూర్తి చేసినందుకు ఈ గ్రామానికి జనవరి 2019న బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశంగా సర్టిఫికెట్ దక్కింది.
- రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు ఈ గ్రామానికి జంపుయ్ అనే పేరు వచ్చింది. అదెలాగంటే... నవంబర్ 14, 1944 న అమెరికన్ యుద్ధ విమానం ఒకటి క్రాష్ ల్యాండింగ్ అయింది. దాంతో పైలట్, కో–-పైలట్ ఈ గ్రామంలోనే దూకారు. అప్పుడు వాళ్లను ఈ ఊరి ప్రజలు రక్షించారు. కాబట్టి ‘జంప్’ అనే పదానికి ‘వియ్’ అనే పదం చేసి ‘జంపుయ్’ అంటున్నారు.