
మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసుల్లో ఇరుక్కుని విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి బిగ్ షాక్ తగిలింది. లలిత్ మోదీ వనాటు పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వనాటు అధికారిక మీడియా ప్రకటనలో పేర్కొంది. లలిత్ మోడీ వనాటు పాస్‌పోర్ట్ రద్దు చేయడంలో భారత హైకమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించారు.
పాస్ పోర్ట్ దరఖాస్తు సమయంలో ఇంటర్‌పోల్ స్క్రీనింగ్‌లతో నిర్వహించిన అన్ని తనిఖీలలో ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. గత 24 గంటల్లో ఇంటర్‌పోల్ లలిత్ మోదీపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలన్న భారత అధికారుల అభ్యర్థనలను రెండుసార్లు తిరస్కరించిందని నాకు తెలిసింది. దీనికి తగిన న్యాయపరమైన ఆధారాలు లేకపోవడం వల్ల వారి విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తిరస్కరించింది. లలిత్ మోదీ భారత్ లో చేసిన నేరాల విచారణ నుంచి తప్పించుకోవడానికి వనాటు పౌరసత్వం తీసుకున్నట్లు తెలిసింది. అందుకే లలిత్ మోదీ పౌరసత్వం క్యాన్సిల్ చేయాలని నిర్ణయించాం. వనాటు పౌరసత్వం తీసుకోవాలంటే చట్టబద్ధమైన కారణాలుండాలి అని ప్రధానమంత్రి నపట్ జోతం చెప్పారు.
లలిత్ మోదీ ఐపీఎల్ బాస్ గా ఉన్నప్పుడు వేల కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. లలిత్ మోదీ దాదాపు 15 ఏళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. అక్కడి నుంచి మకాం మార్చేందుకు ఆయన ఇటీవల వనాటు దేశ గోల్డెన్ వీసా తీసుకున్నట్లు తెలిసింది. ఇది రెండు రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది.
వనాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం, ఇది 83 ద్వీపాల ద్వీపసమూహాన్ని కలిగి ఉంది. ఆస్ట్రేలియాకు తూర్పున న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న వనాటు ఆస్ట్రేలియా , ఫిజి మధ్య ఉంది. దీని రాజధాని అతిపెద్ద నగరం పోర్ట్ విలా, ఇది ఎఫేట్ ద్వీపంలో ఉంది. వనాటు జాతీయ భాష బిస్లామా, ఇది క్రియోల్ భాష, ఇంగ్లీష్ , ఫ్రెంచ్ అధికారిక భాషలుగా ఉన్నాయి.