తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్పై సంతకం చేసిన ఆయన చేతిలో ‘వారాహి డిక్లరేషన్’ అనే బుక్ కూడా ఉండటం ఆసక్తి రేకెత్తించింది. తిరుమల వెంకన్న సాక్షిగా పవన్ చేతిలో కనిపించిన "వారాహి డిక్లరేషన్" పుస్తకం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
‘వారాహి డిక్లరేషన్’తో తిరుమల శ్రీవారిని పవన్ దర్శించుకున్నారు. అసలు ఆ ‘వారాహి డిక్లరేషన్’ పుస్తకంలో ఏముందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో అరాచకాలు జరిగాయని, ఆ వివరాలు మొత్తం ఈ బుక్లో ఉన్నాయని జనసేన అభిమానులు చెప్పుకొస్తున్నారు. గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీలోని దేవాలయాలపై దాడులకు సంబంధించిన సమాచారం ఉందని అంటున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఫైల్ ను తన వెంట తీసుకువెళ్లారు.
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
రేపు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో డిక్లరేషన్ వెల్లడిస్తారు.#ధర్మో_రక్షతి_రక్షితః… pic.twitter.com/4IQy5MWvgZ
తిరుపతిలో గురువారం జరగనున్న వారాహి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు సమాచారం. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత దీక్షను పవన్ విరమించనున్నారు. దర్శనానంతరం నేరుగా తరిగొండ అన్న ప్రసాద సముదాయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ అక్కడ అన్న ప్రసాద సముదాయంలో అన్నప్రసాదాల తయారీని పరిశీలించారు. అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక, లడ్డూ ప్రసాదం తయారు చేసే బూందీ పోటుని కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.
ALSO READ | తిరుమలలో డిక్లరేషన్పై పవన్ సంతకం.. ఎందుకు చేశారంటే..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంగా మారిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం విదితమే.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ తిరుమల వెళ్లారు. మంగళవారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ పవన్ ముందుకు సాగారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంకన్న సాక్షిగా దీక్ష విరమించనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగిన విషయం విదితమే.
తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనే వాదనను ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూలను తయారు చేయడానికి జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని ఉపయోగించారని కచ్చితంగా నిర్ధారించేందుకు సీఎం వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.
‘‘రిపోర్టుల ప్రకారం.. నెయ్యిలో కల్తీ జరిగినట్టు తేలింది. దానిపై మీరు (సీఎం) విచారణకు ఆదేశించినప్పుడు.. మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి” అని వ్యాఖ్యానించింది. ‘‘లడ్డూల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపించారా? కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు కదా. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నది” అని మండిపడింది.