వినోద్ ప్రయాణం కాశీతో మొదలై కుషీనగర్​ వరకు..!

వినోద్ ప్రయాణం కాశీతో మొదలై కుషీనగర్​ వరకు..!

యువ రచయిత వినోద్ మామిడాల తన వారణాసి పర్యటన గురించి ఈ పుస్తకంలో అక్షరీకరించారు. ఉత్తరప్రదేశ్​లోని వారణాసిని రెండు సార్లు సందర్శించి, అక్కడి విశేషాలను, సమాచారాన్ని పుస్తకరూపంలో పాఠకుల ముందుంచారు. కాశీలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెనక్కి బయలుదేరే వరకు తాను చూసిన ప్రతి అంశాన్ని పాఠకులతో పంచుకోవాలని రచయిత చేసిన ప్రయత్నం అభినందనీయం.

ఈ పుస్తకంలో కాశీతో మొదలైన వినోద్ ప్రయాణం కుషీనగర్ సందర్శనతో ముగుస్తుంది.   ఈ పుస్తకంలోని ‘వారణాసి తొలి ఉదయం’ భాగం ద్వారా వారణాసిలోని పుణ్య క్షేత్రాలను వివరించారు. ఎనిమిది ఘాట్లను, వాటి ప్రాముఖ్యతను తెలిపిన విధానం ఆకట్టుకుంది. ‘మాన్ మందిర్ ప్యాలెస్’లో పురాతన మ్యూజియాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లు వివరించారు.

గంగా నది ఒడ్డునే ఈ మ్యూజియం, జంతర్​ మంతర్​ ఉన్నట్టు చాలామంది యాత్రికులకు సుపరిచతం కాదు. కానీ యాత్రలో భాగంగా ఈ జంతర్​ మంతర్​ను కూడా  చూడొచ్చని తెలుస్తుంది. ఇక్కడే తనకు తారసపడిన ఇషాని జైశ్వాల్, ఆమె జీవిత లక్ష్యానికి సంబంధించిన కొన్ని అనుభవాలు పాఠకులకు అందించారు. ‘వారణాసిలో సూర్యోదయం’ భాగంలో రచయిత  మధుర స్వప్నం పఠనాశక్తి తీరుకు అద్దం పడుతుంది.

‘పట్టు వస్త్రాలకు పెట్టింది పేరు’తో  నేత కార్మికుల జీవితాలను కూడా కండ్ల ముందుంచారు. బనారస్​ పట్టు చీరలు నేసే కుటుంబాలను స్వయంగా కలిశారు రచయిత. తరాలుగా పనిచేస్తున్నా మారని వారి బతుకు గురించి ఆయన వివరించిన కోణం జీవితాలను ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుపుతుంది. గంగా నదిలో బోటు నడుపుతున్న తమిళుడు రతన్​తో కూడా రచయిత మనసు విప్పి మాట్లాడారు.

వలస వచ్చి వారణాసిలో స్థిరపడ్డ రతన్​ బోటు నడుపుతూనే జీవనం సాగిస్తున్నాడు. వారణాసి ఇలా అనేక జీవితాలకు, జీవన శైలికి కేంద్రంగా విరాజిల్లుతోందని రచయిత అక్కడి స్థానికులతో మాట్లాడుతూ.. వారి విశేషాలను పాఠకుల ముందు ఉంచారు. ఫాదర్​  ఆఫ్​ ఇండియన్ ట్రావెలాగ్ రాహుల్ సాంకృత్యాన్ గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సాంకృత్యాయన్​ గురించి ఈ తరం యువత తప్పక తెలుసుకోవాలని రచయిత తపన పడ్డాడు.

గంగా హారతి, కాశీ విశ్వనాధుని దర్శనం, హారతులు, అన్నపూర్ణ ఆలయం, ఆహారయాత్ర, సారనాథ్ విశేషాలను రచయిత వర్ణించిన తీరు భవిష్యత్తులో తప్పకుండా కాశీ వెళ్లాలనే ప్రేరణను పాఠకులకు కలిగిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఈ పుస్తకం వారణాసి వెళ్లేవారికి ఒక మంచి గైడ్​గా కూడా ఉపయోగపడుతుంది.  


కేవలం యాత్రాకథనంగా కాకుండా.. ఒక రమ్యమైన నవల లాగా సాగే ఈ పుస్తకం ద్వారా వినోదం, అంతకు మించిన విజ్ఞానం ఈ పుస్తకం ద్వారా పాఠకులు పొందుతారు. వారణాసి వంటి యాత్రా పుస్తకాలను చదవటం నేటి తరం ముందున్న అతి ముఖ్యమైన పనుల్లో ఒకటని చెప్పడం
అతిశయం కాదు.- - మహేశ్ పల్నాటి

పుస్తకం      : వారణాసి
రచయిత  : వినోద్​ మామిడాల
పేజీలు      : 144
కాపీలకు   : పాలపిట్ట బుక్స్​, అమెజాన్​