వర్ధన్నపేటలో 32 కిలోల గంజాయి స్వాధీనం .. ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్ట్

వర్ధన్నపేటలో  32 కిలోల గంజాయి స్వాధీనం .. ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్ట్

వర్ధన్నపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సామ్సంగ్‌‌ దళ బెహరా, మార్తో రహెతో అనే ఇద్దరు గంజాయి రవాణా చేయడానికి సయోని అని మహిళతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా మహిళ నుంచి గంజాయి ప్యాకెట్లు తీసుకొని మార్చి 28న రాత్రి ఛత్రపూర్‌‌ వద్ద రైలు ఎక్కి 29న విజయవాడలో దిగారు. 

అక్కడి నుంచి సూరత్‌‌ వెళ్లేందుకు నవజీవన్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ ఎక్కారు. అయితే వరంగల్‌‌ రైల్వేస్టేషన్‌‌కు చేరుకోగానే ట్రైన్‌‌ను పోలీసులు చెక్‌‌ చేస్తుండడంతో ట్రైన్‌‌ దిగి బస్టాండ్‌‌ పరిసరాల్లో తలదాచుకున్నారు. తర్వాత అక్కడి మెయిన్‌‌రోడ్డు మీదుగా వర్ధన్నపేట చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల టైంలో వర్ధన్నపేట ఎస్‌‌బీఐ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకొని సోదా చేయగా గంజాయి విషయం బయటపడింది. దీంతో రూ. 16,37,500 విలువైన 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.