- పురిటి నొప్పులతో కాన్పుకు పోతే బయటకు పంపారు!
- వర్ధన్నపేట సర్కార్ దవాఖాన వైద్య సిబ్బంది నిర్వాకం
- వరంగల్ కు వెళ్తుండగా 108లోనే డెలివరీ
వర్ధన్నపేట, వెలుగు: ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ అర్ధరాత్రి సర్కార్ దవాఖానకు పోతే సిబ్బంది పట్టించుకోకుండా బయటకు పంపారు. 108లో అంబులెన్స్ లో వెళ్తుండగా మార్గమధ్యలో మెడికల్ టెక్నీషియన్ కాన్పు చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన గర్భిణి కిన్నెర నాగమణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు గురువారం అర్ధరాత్రి 12 గంటలకు అంబులెన్సులో వర్ధన్నపేట సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది, గర్భిణి పొట్టలో ఉమ్మ నీరు ఎక్కువగా ఉందని చెప్పారు. డాక్టర్లను పిలిపించి వెంటనే కాన్పు చేయించాలని కుటుంబసభ్యులు బతిమిలాడారు. ఆపరేషన్ ఉంటేనే వస్తారని, ఎమర్జెన్సీ అయితే చేసేందుకు పరికరాలు లేవని వరంగల్ కు వెళ్లాలని సూచించారు. అక్కడే కొద్దిసేపు ఉండగా.. ఎంతకూ డాక్టర్లు రాకపోయేసరికి చేసేదేం లేక108లో వరంగల్ కు బయలుదేరి వెళ్తున్నాడు. పంథిని గ్రామ శివారులో నాగమణికి నొప్పులు తీవ్రమవడంతో అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ సదానందం నార్మల్ డెలివరీ చేయగా మగబిడ్డ జన్మించాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆపదలో సర్కార్ దవాఖానకు తీసుకెళ్తే.. ఒక్క డాక్టరు కూడా అందుబాటులో లేరని, వైద్య సిబ్బంది పట్టించుకోలేదని కుటుంబసభ్యులు ఆవేదనతో చెప్పారు. 108ను పిలిచేందుకు కూడా తమకు సహకరించలేదని మండిపడ్డారు. ఘటనపై ఆయనను వివరణ కోరగా, దవాఖానలో డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పడం అవాస్తవమని.. తల్లీ బిడ్డ క్షేమం కోసమే వరంగల్ కు వెళ్లాలని సూచించామని చెప్పారు. తమ తప్పేం లేదంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ సమర్ధించుకోవడం గమనార్హం.