విద్యాధరిలో వసంతపంచమి ఉత్సవాలు

విద్యాధరిలో వసంతపంచమి ఉత్సవాలు

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ మాత ఆలయం సోమవారం జరిగే వసంత పంచమి వేడుకలకు సిద్ధమైంది. అక్షరాభ్యాసాలకు భక్తులు ఎక్కువగా తరలి రానున్నారు. ఇందుకోసం క్షేత్రంలో విడతలవారీగా అక్షరాభ్యాసాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రద్దీకి తగినట్టుగా బారీకేడ్లు, చలువ పందిళ్లు వేశారు. సికింద్రాబాద్, సిద్దిపేట, గజ్వేల్ నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

గౌరారం రాజీవ్ రహదారి నుంచి గుట్టపైకి ఉచిత బస్సు సదుపాయం కల్పించనున్నారు. సోమవారం తెల్లవారుజామున కంచి పీఠాధిపతి విద్యాశంకరభారతి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, చండీహోమం నిర్వహిస్తారు. అనంతరం ఆలయ పుర వీధుల్లో ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ, లక్షపుష్పార్చన నిర్వహిస్తారు. తర్వాత 56 రకాల తీపి పదార్థాల నైవేద్యం ఉంటుంది.

సాయంత్రం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి చేతుల మీదుగా వైదిక స్కూల్​స్టూడెంట్స్​కు పుస్తకావిష్కరణ ఉంటుంది. అనంతరం శ్రీచక్ర పూజ నిర్వహిస్తారు. భక్తులందరికీ అన్నదానం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.