కిచెన్ తెలంగాణ : సండే స్పెషల్.. దోసకాయతో అదిరిపోయే రుచులు!

కిచెన్ తెలంగాణ : సండే స్పెషల్.. దోసకాయతో అదిరిపోయే రుచులు!

దోస ఆవకాయ.. పేరు వింటేనే నోరూరిపోతుంటుంది చాలామందికి. అలాగే నాన్​వెజ్ ప్రియులకు దోసకాయ మటన్... ఇవేకాకుండా దోసకాయతో రొట్టె కూడా చేసుకునేవాళ్లు అప్పట్లో. ఈ మూడు రెసిపీలు రుచిలో వేటికవే సాటి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే రుచి ఉంటాయి. మరింకెందుకాలస్యం.. ఈ దోసకాయ వెరైటీలపై ఓ లుక్కేయండి. 

దోసకాయ .. ఆవకాయ తయారీకి కావాల్సినవి 

  • దోసకాయ ముక్కలు – మూడు కప్పులు 
  • ఉప్పు – పావు కప్పు
  • కారం – అర కప్పు
  • ఆవాలు – పావు కప్పు
  • మెంతి పొడి – ఒక టేబుల్ స్పూన్ 
  • పల్లీ నూనె – ఒక కప్పు

తయారీ విధానం: దోసకాయల్ని శుభ్రంగా కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీజార్​లో ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి వేసి బాగా కలపాలి. అందులో నూనె వేసి మరోసారి కలపాలి. గాలి చొరబడకుండా మూతపెట్టి ఒకరోజంతా పక్కన ఉంచాలి. ఆ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు.. మూడు రోజుల తర్వాత ఒకసారి రుచి ఎలా ఉందో చూసి అవసరమైతే ఉప్పు, కారం, నూనె వంటివి కలుపుకోవచ్చు. 

దోసకాయ రోటీ తయారీకి కావాల్సినవి

  • దోసకాయ, ఉల్లిగడ్డ – ఒక్కోటి
  • బియ్యప్పిండి – ఒక కప్పు
  • ఉప్పు, నూనె – సరిపడా
  • పసుపు – పావు టీస్పూన్
  • జీలకర్ర, వాము – ఒక్కోటి అర టీస్పూన్
  • నువ్వులు, కారం – ఒక్కో టీస్పూన్
  • పచ్చిమిర్చి – అల్లం పేస్ట్ – టేబుల్ స్పూన్
  • కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
  • శనగపప్పు (నానబెట్టి)– రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: దోసకాయను తొక్క తీసి తురమాలి. ఆ తురుమును ఒక గిన్నెలో వేసి అందులో బియ్యప్పిండి, నూనె, జీలకర్ర, ఉప్పు, వాము, నువ్వులు, కారం, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి – అల్లం పేస్ట్, నానబెట్టిన శనగపప్పును కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ముద్దగా చేసిన తర్వాత ఉండలు చేయాలి. వాటిని చేత్తో రొట్టెలా పల్చగా వత్తాలి. పాన్​ వేడి చేసి రొట్టెను వేసి నూనెతో రెండు వైపులా కాల్చాలి. ఈ రెసిపీలో బియ్యప్పిండి బదులు జొన్నపిండి, సజ్జ పిండి వంటివి కూడా వాడొచ్చు. 

దోసకాయతో మటన్ తయారీకి కావాల్సినవి 

  • మటన్ – అరకిలో, 
  • పసుపు – పావు టీస్పూన్
  • ఉప్పు, నీళ్లు – సరిపడా, 
  • కారం – ఐదు టీస్పూన్లు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
  • దోసకాయ, టొమాటో – ఒక్కోటి
  • ఉల్లిగడ్డలు – రెండు, 
  • నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
  • దాల్చిన చెక్క – ఒకటి, 
  • లవంగాలు – నాలుగు
  • పచ్చిమిర్చి – రెండు, కరివేపాకు, 
  • కొత్తిమీర – కొంచెం
  • ధనియాల పొడి – రెండు టీస్పూన్లు
  • జీలకర్ర పొడి – అర టీస్పూన్
  • గరం మసాలా – ఒక టీస్పూన్

తయారీ విధానం : ప్రెజర్ కుక్కర్​లో శుభ్రంగా కడిగిన మటన్ వేసి అందులో పసుపు, రెండు టీస్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేయాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. 

ఒక పాన్​లో నూనె వేడి చేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పసుపు, ఉప్పు వేసి వేగించాలి. అవి వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలపాలి. ఆ తర్వాత కరివేపాకు, టొమాటో ముక్కలు వేయాలి. అవన్నీ మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేయాలి. మూడు టీస్పూన్ల కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన మటన్​, గరం మసాలా వేసి  నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చివరిగా కొత్తిమీర చల్లాలి.