Good Food : ఇడ్లీతో ఈజీ స్నాక్స్.. ఇడ్లీ పకోడీ, ఇడ్లీ చాట్, ఇడ్లీ మంచూరియా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

Good Food : ఇడ్లీతో ఈజీ స్నాక్స్.. ఇడ్లీ పకోడీ, ఇడ్లీ చాట్, ఇడ్లీ మంచూరియా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏం తిన్నారంటే... ఎక్కువమంది తిన్నామని చెప్పేది ఇడ్లీనే. ఇడ్లీని రోజు తినాలంటే బోర్ కొడుతుంది, అవునా..? అందుకే తాజా ఇడ్లీలు లేదా మిగిలిన ఇడ్లీలతో వెరైటీలు చేసుకొని తినొచ్చు. ఎట్లంటరా? ఇదిగో ఇట్ల. .. ఇడ్లీలతో పకోడీ, ఫ్రైలే కాకుండా చాట్, మంచూరియా కూడా చేయొచ్చు.. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . 

ఇడ్లీ మంచూరియా తయారీకి కావాల్సినవి

  • ఇడ్లీలు- 6
  • మైదా లేదా శనగపిండి - అర కప్పు
  •  కార్న్ ఫ్లోర్ -పావు కప్పు
  •  అల్లం-వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • కారం- రుచికి సరిపడా
  •  మిరియాల పొడి -పావు టీ స్పూన్
  •  నూనె- సరిపడా
  •  సాస్ తయారీకి ఉల్లిగడ్డ (చిన్నది)- ఒకటి 
  • చిల్లీసాస్- ఒక టీ స్పూన్ 
  • టొమాటో కెచప్- రెండు టీస్పూన్లు
  • సోయాసాస్ -ఒక టీస్పూన్ 
  • మిరియాల పొడి- అరటీ స్పూన్ 
  • ఉల్లికాడ తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో మైదా లేదా శెనగపిండి పోయాలి. దాంట్లో కార్న్ ఫ్లోర్ అల్లం- వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి.. తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి. ఇడ్లీలను ముక్కలుగా కట్ చేయాలి. తాజా ఇడ్లీలయితే అరగంట ఫ్రిజ్లో ఉంచాలి.. పాన్ లో నూనె వేడి చేయాలి. ఇడ్లీ ముక్కల్ని పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేగించాలి. అలాగే పాన్ లోని నూనె అంతా వంపేసి, రెండు టీ స్పూన్లు మాత్రం ఉంచి.. ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అల్లం- వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, సోయాసాస్,  చిల్లీసాస్, టొమాటోసాస్, ఉప్పు, -మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత ఒక టీస్పూన్  కార్న్ ఫ్లోర్ కూడా వేసి కలపి ఉల్లికాడ  తరుగు వేయాలి. ఆ పైన వేగించిన ఇడ్లీ ముక్కలు వేపీ కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లి దింపాలి.

Also Read:- టాటూతో వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే.. !

చాట్ తయారీకి కావాల్సినవి

  • ఇడ్లీలు- ఆరు 
  • ఉల్లిగడ్డ తరుగు -ఒక టేబుల్ స్పూన్
  • టొమాటో తరుగు -ఒక టేబుల్ స్పూన్
  • పెరుగు-అర కప్పు
  • కొత్తిమీర తరుగు- ఒక టేబుల్ స్పూన్
  •  పుదీనా తరుగు- ఒక టేబుల్ స్పూన్
  • స్వీట్ చట్నీ-ఒక టేబుల్ స్పూన్
  •  గ్రీన్ చట్నీ- పావు కప్పు
  • బూందీ-పావు కప్పు
  • కారం- పావు టీ స్పూన్
  • చాట్ మసాలా- రుచికి సరిపడా
  •  జీలకర్ర పొడి- ఒకటీ స్పూన్
  • సేమ్యా- సరిపడా
  • ఉప్పు- తగినంత
  • నూనె- సరిపడా

తయారీ విధానం:  ఇడ్లీలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఇడ్లీ ముక్కలు వేగించాలి. తర్వాత గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, సేమ్యా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేయాలి. చివరగా ఉల్లిగడ్డ తరుగు, టొమాటో తరుగు, పెరుగు, బూందీ తో గార్నిష్ చేసి తినాలి.

ఇడ్లీ పకోడీ తయారీకి కావాల్సినవి

  • ఇడ్లీలు- ఐదు
  • శనగపిండి- ఒక కప్పు
  •  కారం- అర టీస్పూన్ 
  • పసుపు- చిటికెడు
  •  వాము- అర టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె -సరిపడా

తయారీ విధానం :  ఇడ్లీలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో శెనగపిండి, పసుపు, ఉప్పు, కారం వాము వేసి కొన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. పాన్ లో  నూనె వేడి చేయాలి. ఇడ్లీ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని ఏదైనా చట్నీలో నంజుకుని తింటే రుచి అదిరిపోతుంది

మసాలా ఇడ్లీ ఫ్రై తయారీకి కావాల్సినవి

 

  • ఇడ్డీలు- 5
  • చాట్ మసాలా- ఒక టేబుల్ స్పూన్
  • ఉప్పు- తగినంత
  • నూనె  -సరిపడా
  • టొమాటో తరుగు - ఒక టేబుల్ స్పూన్
  • కారం-కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • కరివేపాకు - ఒక రెమ్మ( కావాలంటే)
  •  నిమ్మరనం - ఒక టీస్పూన్

తయారీ విధానం : ఇడ్లీలను  చిన్న చిన్న ముక్కలుగా కటి చేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఇడ్లీ ముక్కలను వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్ లో మళ్లీ కొద్దిగా నూనె వేడి చేసి, జీలకర్ర,ఆవాలు, కరివేపాకు వేయాలి. తర్వాత టొమాటో తరుగు, ఉప్పు,కారం, కొన్ని నీళ్లు పోసి మగ్గబెట్టాలి. ఇడ్లీ ముక్కలు, కొత్తిమీరతరుగు, చాట్ మసాలా, నిమ్మరసం కూడా వేసి కలపాలి. వీటిని కొబ్బరి లేదా పల్లీల చట్నీతో తింటే బాగుంటుంది.

-వెలుగు, లైఫ్-