తెలంగాణ వంటకాలు : కీరాతో కారంగా.. అదిరిపోయే రుచులు

తెలంగాణ వంటకాలు : కీరాతో కారంగా.. అదిరిపోయే రుచులు

వేరే సీజన్స్​లో కంటే వేసవిలో ప్రతి ఇంట్లో కనిపించే వెజిటబుల్స్​లో కీరదోస ఒకటి. ఒంటికి చలువ అంటూ సలాడ్స్, పెరుగు పచ్చడి, జ్యూస్, చాట్​లు ఇలా రకరకాలుగా తీసుకుంటారు. అయితే ఇవే కాకుండా కీరాతో మరెన్నో వెరైటీలు చేసుకోవచ్చు. వాటిలో కీరాతో కూర వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. కీరాతో పకోడీలు కూడా వేసుకోవచ్చు. ఏంటి.. నోరూరిపోతుందా? అయితే ఇంకెందుకాలస్యం.. వెంటనే వాటి తయారీ విధానం ఎలాగో చదివి తెలుసుకోండి.  

కీరాతో పచ్చడి తయారీకి  కావాల్సినవి 

  • కీరదోస, టొమాటోలు – రెండేసి చొప్పున
  • పచ్చిమిర్చి – పది, పల్లీలు – ఒక టీస్పూన్
  • మినప్పప్పు – ఒకటిన్నర టీస్పూన్
  • జీలకర్ర – అర టీస్పూన్
  • నూనె – సరిపడా
  • ఉప్పు – సరిపడా
  •  వెల్లుల్లి – ఐదు
  • చింతపండు – కొంచెం
  • తాలింపు గింజలు – ఒక టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి – మూడు
  •  కరివేపాకు – కొద్దిగా
  • ఇంగువ – చిటికెడు
  • వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

తయారీ విధానం: పాన్​లో నూనె వేడి చేసి అందులో పల్లీలు, మినప్పప్పు వేసి వేగించి పక్కనపెట్టాలి. తర్వాత అదే పాన్​లో పచ్చిమిర్చి, దోసకాయ, టొమాటో ముక్కలు ఒకదానితర్వాత ఒకటి వేగించాలి. అవన్నీ బాగా వేగాక, కాస్త చల్లారనివ్వాలి. ఆపై రోటిలో లేదా మిక్సీజార్​లో వేగించిన పల్లీలు, మినప్పప్పు, పచ్చిమిర్చితోపాటు జీలకర్ర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత అందులో దోసకాయ, టొమాటో ముక్కలు వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగించాలి. అందులో రెడీ చేసిన పచ్చడి వేసి కలపాలి. ఈ పచ్చడి రోటిలో చేసుకుంటే టేస్ట్​ ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కాంబినేషన్​ అదిరిపోతుంది. 

కీరాతో పకోడీ  తయారీకి కావాల్సినవి :

  • కీరదోస, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ – ఒక్కోటి
  • పచ్చిమిర్చి – ఐదు
  • పల్లీలు – ఒక టేబుల్ స్పూన్
  • అల్లం – చిన్న ముక్క
  • కొత్తిమీర, కరివేపాకు – కొంచెం
  • ఉప్పు – సరిపడా
  • జీలకర్ర – అర టీస్పూన్
  • బియ్యప్పిండి – మూడు టేబుల్ స్పూన్లు
  • పెరుగు – రెండు టీస్పూన్లు

తయారీ విధానం  : ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, అల్లం పలుకులుగా గ్రైండ్ చేయాలి. తొక్క తీసిన కీర, ఆలుగడ్డల్ని ముక్కలుగా కట్ చేయాలి. వాటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీపట్టాలి. వీటిన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, బియ్యప్పిండి  కూడా వేసి బాగా కలపాలి. అవన్నీ కలిపాక పెరుగు కూడా వేసి మరోసారి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. ఇవి శ్నాక్​లా తినడానికి చాలా బాగుంటాయి.

కీరా కర్రీ  వంటకానికి  కావాల్సినవి :

  • కీరదోస, టొమాటో, ఉల్లిగడ్డ – ఒక్కోటి
  • పచ్చిమిర్చి – రెండు
  • జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, 
  • ధనియాల పొడి, 
  • జీలకర్ర పొడి – ఒక్కో టీస్పూన్
  • కొత్తిమీర – కొంచెం
  • కారం, ఉప్పు, నీళ్లు – సరిపడా
  • పసుపు – పావు టీస్పూన్
  •  నూనె – మూడు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం : కీరదోసను తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి వేగించాలి. తర్వాత అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. ఆ తర్వాత కీరదోస ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి మరికాసేపు ఉడికించాలి.