కాలీ ఫ్లవర్(గోబీ)తో వంట చేయాలంటే ‘అబ్బా బోర్’ అంటారు కొందరు. అందుకు కారణాలు ఏవైనా కానీ కాలీఫ్లవర్‌తో కూర, వేపుడు, మంచూరియా వంటి రెగ్యులర్ వంటలు కాకుండా వెరైటీ వంటలు చేసిపెడితే! కాలీ ఫ్లవర్ అంటే ‘నో...’ అనేవాళ్లు కూడా మళ్లీ తింటాం అనడం ఖాయం.
రోస్ట్
కావాల్సినవి :
కాలీ ఫ్లవర్ ముక్కలు - పావు కిలో
నూనె, ఉప్పు - సరిపడా
పసుపు, మిరియాల పొడి, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
దాల్చిన చెక్క - ఒకటి
లవంగాలు - నాలుగు
యాలకులు - రెండు
జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి - ఒక్కో టీస్పూన్
ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
పచ్చిమిర్చి - మూడు
టొమాటో - ఒకటి
పసుపు - చిటికెడు
కారం - ఒకటిన్నర టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి, ఉప్పు వేయాలి. అందులో కాలీ ఫ్లవర్ ముక్కల్ని ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేసి కడిగిన కాలీ ఫ్లవర్ ముక్కలు వేగించాలి. అవి కాస్త వేగాక పసుపు, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు వేసి కలపాలి. సన్నటి మంట మీద మరికాసేపు వేగించాలి. మరో పాన్‌లో నూనె వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కోటి వేస్తూ వేగించాలి. తర్వాత టొమాటో గుజ్జు కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక ఉప్పు, పసుపు, కారం కలపాలి. అందులో కాలీ ఫ్లవర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. పైనుంచి వేగించిన జీడిపప్పులు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ వేపుడుని అన్నం, చపాతీల్లో తిన్నా, దేనిలో కలపకుండా తిన్నా బాగుంటుంది.
పాప్ కార్న్
కావాల్సినవి :
కాలీ ఫ్లవర్ ముక్కలు, కొత్తిమీర తరుగు, పెరుగు - ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున
కార్న్ ఫ్లోర్, మైదా - ఒక్కోటి అర కప్పు
మిరియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్
ఉప్పు, నీళ్లు, బ్రెడ్ క్రంబ్స్, నూనె - సరిపడా
అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ - ఒక్కో టేబుల్ స్పూన్
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు వేడి చేయాలి. అందులో కాలీ ఫ్లవర్ ముక్కలు, ఉప్పు వేసి పదినిమిషాలు ఉడికించాలి. కార్న్ ఫ్లోర్, మైదా, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కాలీ ఫ్లవర్ ముక్కలు కూడా వేసి మళ్లీ ఓసారి కలపాలి. తర్వాత వాటిని పక్కకు తీసి, మిగిలిన పిండి మిశ్రమంలో సోయా సాస్, పెరుగు వేయాలి. అందులో నీళ్లు పోసి కలపాలి. కాలీ ఫ్లవర్ ముక్కల్ని మిశ్రమంలో ముంచి, బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించి నూనెలో వేగిస్తే కాలీ ఫ్లవర్ పాప్‌కార్న్ రెడీ.
ఫ్రైడ్ కాలీఫ్లవర్ రైస్
కావాల్సినవి :
కాలీ ఫ్లవర్ - ఒకటి
సోయా సాస్, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి - ఒక్కో టీస్పూన్ చొప్పున
ఆవనూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లికాడల తరుగు - అర కప్పు
కోడిగుడ్లు - రెండు
నూనె, ఉప్పు - సరిపడా
తయారీ : కాలీ ఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి, మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. కాలీఫ్లవర్ ముద్దని తేమ లేకుండా టిష్యూపేపర్తో అదమాలి. తరువాత దాన్ని పాన్‌లో వేగించాలి. పాన్‌లో ఆవనూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. అందులో కాలీ ఫ్లవర్ మిశ్రమం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. మరో పాన్‌లో కోడిగుడ్ల సొన వేగించాలి. దీన్ని గోబీ మిశ్రమంలో వేసి కలపాలి. ఇదే రైస్ లేని ఫ్రైడ్ రైస్. ఇష్టపడేవాళ్లు ఇందులో ఫిష్ సాస్ కూడా వేసుకోవచ్చు.
కాలీ ఫ్లవర్ రైస్
కావాల్సినవి :
కాలీ ఫ్లవర్ - ఒకటి
బాస్మతీ అన్నం - ఒక కప్పు
దాల్చిన చెక్క- ఒకటి
లవంగాలు - నాలుగు
యాలకులు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి - ఒక్కోటి రెండేసి
టొమాటో - ఒకటి
కొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, పుదీనా - కొంచెం,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
సాంబార్ పొడి - రెండు టీస్పూన్లు
నెయ్యి, ఉప్పు - సరిపడా
తయారీ : పాన్‌లో నెయ్యి వేడి చేసి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమాటో తరుగు, కొబ్బరి పొడి, ఉప్పు, సాంబార్ పొడి వేసి కలపాలి. (సాంబార్ పొడి బదులు కారం కూడా వాడొచ్చు.) కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీజార్‌లో మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి కాలీ ఫ్లవర్ ముక్కలు, సాంబార్ పొడి కలపాలి. తర్వాత అందులో మసాలా పేస్ట్ కలపాలి. కొత్తిమీర, పుదీనా చల్లి మరికొంచెం నెయ్యి వేయాలి. ఆ తర్వాత బాస్మతి అన్నం, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి.
కరకరలాడే వడ
కావాల్సినవి :
కాలీ ఫ్లవర్ - ఒకటి,
ఉల్లిగడ్డ తరుగు బియ్యప్పిండి - ఒక్కోటి అర కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
పసుపు, వాము - ఒక్కోటి పావు టీస్పూన్
కారం, గరం మసాలా - ఒక్కోటి అర టీస్పూన్
ఉప్పు - సరిపడా
కరివేపాకు - కొంచెం
శెనగ పిండి - ఒక కప్పు
తయారీ : ఒక గిన్నెలో కాలీఫ్లవర్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, వాము, కరివేపాకు, శెనగపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉండలు చేసి, వాటిని వడల్లాగ వత్తాలి. నూనెలో ముదురు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా వేగిస్తే కరకరలాడే కాలీఫ్లవర్ వడలు రెడీ.