తెలంగాణ కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : పైనాపిల్ తో ఈ సండే వెరైటీ వంటకాలు

తెలంగాణ కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : పైనాపిల్ తో ఈ సండే  వెరైటీ వంటకాలు

పైనాపిల్​.. తినే ఉంటారు. జ్యూస్ కూడా చాలామంది తాగి ఉంటారు. అయితే పైనాపిల్​ని వండుకుని తిన్నా చాలా టేస్టీ ఉంటుందని తెలుసా! పైనాపిల్​తో స్వీట్లు, సమ్మర్ డ్రింక్స్ తయారుచేసుకోవచ్చు. వాటిలోబర్ఫీ, హల్వా, షికంజి రెసిపీల గురించి ఈ వారం మీకోసం. మరి వాటి తయారీ విధానం ఎలాగో తెలుసుకోవాలంటే.. ఇక్కడ చదివేయండి. 

బర్ఫీ

కావాల్సినవి :


చక్కెర, పైనాపిల్ ముక్కలు :ఒక్కోటి రెండు కప్పులు
నీళ్లు : మూడు కప్పులు, 
యాలకుల పొడి : అర టీస్పూన్, కొబ్బరి ముక్కలు
కస్టర్డ్ పౌడర్ : ఒక్కో కప్పు 
నెయ్యి : ఐదు టేబుల్ స్పూన్లు
నట్స్ : సరిపడా

తయారీ : పాన్​లో చక్కెర, యాలకుల పొడి వేసి, నీళ్లు పోసి మరిగించాలి. మిక్సీజార్​లో పైనాపిల్, కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ నీటిని వడకట్టాలి. అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చక్కెర పాకంలో పోస్తూ కలపాలి. దగ్గరపడేవరకు కలుపుతూ ఉడికించాలి. కాసేపయ్యాక నెయ్యి వేసి కలపాలి. పాన్​కి అస్సలు అంటుకోకుండా ముద్దగా వచ్చేవరకు మిశ్రమాన్ని ఉడికించాలి. ఒక గిన్నెకి నూనె పూసి లేదా బటర్ పేపర్ వేసి అందులో పైనాపిల్ మిశ్రమం వేసి సమాంతరంగా పరవాలి. చల్లారాక ఫ్రిజ్​లో పెట్టి దాదాపు రెండు గంటలు ఉంచాలి. ఆ తర్వాత తీసి ముక్కలుగా కట్​ చేస్తే పైనాపిల్ బర్ఫీ తినడానికి రెడీ. 

షికంజి

కావాల్సినవి :


పైనాపిల్ ముక్కలు : రెండు కప్పులు
చక్కెర : ఆరు టేబుల్ స్పూన్లు, 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : సరిపడా,చాట్ మసాలా, నల్ల ఉప్పు
జీలకర్ర పొడి : పావు టీస్పూన్ చొప్పున
పుదీనా : కొంచెం

తయారీ : మిక్సీజార్​లో పైనాపిల్ ముక్కలు, చక్కెర వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. ఒక గ్లాసులో నిమ్మరసం, ఉప్పు, చాట్ మసాలా, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, పైనాపిల్ గుజ్జు, పుదీనా వేయాలి. తర్వాత నీళ్లు లేదా సోడా పోసి, అవన్నీ కలిసేలా బాగా కలపాలి. అవసరమైతే ఐస్​ క్యూబ్స్​ వేసుకోవచ్చు. ఈ సమ్మర్​కి బెస్ట్​ డ్రింక్​ తాగాలంటే ఇది ట్రై చేయొచ్చు. 

హల్వా

కావాల్సినవి :


చక్కెర : ఒక్కోటి ముప్పావు కప్పు, నెయ్యి, బాదం, జీడిపప్పు
ఎండుద్రాక్ష : సరిపడా
బొంబాయి రవ్వ : ఒక కప్పు
పైనాపిల్ ముక్కలు : ఒకటిన్నర కప్పు
నీళ్లు : మూడున్నర కప్పులు
యాలకుల పొడి : ఒక టీస్పూన్

తయారీ  : పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో బాదం, జీడిపప్పు తరుగు, ఎండుద్రాక్షలు వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత మరికాస్త నెయ్యి వేసి బొంబాయిరవ్వను వేగించి ఒక గిన్నెలో తీసి చల్లారనివ్వాలి. అదే పాన్​లో మరో పైనాపిల్ ముక్కలు, కొంచెం చక్కెర వేసి వేగనివ్వాలి. అవి వేగాక నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగాక అందులో బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి. మూతపెట్టి నీళ్లు ఇంకేవరకు ఉడికించాలి. ఆ తర్వాత మిగిలిన చక్కెర, యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. చివరిగా కొద్దిగా నెయ్యి వేసి, వేగించిన డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలిపితే తినడమే తరువాయి.