తెలంగాణ కిచెన్..మ్యాజిక్ వాటర్ మెలన్

సమ్మర్​ సీజన్​లో తినాలనిపించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. తింటుంటే మెత్తగా, చల్లగా ఉండే ఈ  వాటరీ ఫ్రూట్​కి ‘నో’ చెప్పేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఈ పుచ్చకాయతో వెరైటీ రెసిపీలు వండొచ్చు తెలుసా? ఆ వెరైటీ మెలన్​ రెసీపీలే ఇవి...

వాటర్ మెలన్ లెమనేడ్

కావాల్సినవి :

పుచ్చకాయ - సగం
నిమ్మకాయలు - రెండు
అల్లం - చిన్న ముక్క

తయారీ : పుచ్చకాయ ముక్కలు కట్ చేసి గింజలు తీసేయాలి. అల్లం సన్నగా తరిగి పుచ్చకాయ ముక్కల్లో వేయాలి. ఆ రెండింటినీ కలిపి మిక్సీజార్​లో వేయాలి. అందులో ఐస్​ ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత నిమ్మరసం పిండాలి. ఆ జ్యూస్​ని వడ కట్టాలి. ఒక గ్లాస్​లో ఐస్​ ముక్కలు వేసి, నిమ్మ చెక్క ఒకటి వేసి దానిపైనుంచి జ్యూస్​ పోయాలి. 

వాటర్ మెలన్ జెల్లీ

కావాల్సినవి :

పుచ్చకాయ జ్యూస్ - రెండు కప్పులు 
చక్కెర - అర కప్పు
కార్న్​ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) - పావు కప్పు
నీళ్లు - పావు కప్పు
ఎండు కొబ్బరి పొడి - సరిపడా

తయారీ : పుచ్చకాయను ముక్కలు తరిగి గింజలు తీసేయాలి. వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ జ్యూస్​ని ఒక గిన్నెలో పోయాలి. అందులో చక్కెర కావాలంటే ఫుడ్​ కలర్ కూడా వేసి కలపాలి. మరో గిన్నెలో కార్న్​ ఫ్లోర్ వేసి అందులో నీళ్లు పోసి కలపాలి. ఒక గిన్నెలో పుచ్చకాయ జ్యూస్​ వేడి చేయాలి. అది మరిగాక అందులో కార్న్​ ఫ్లోర్ మిశ్రమం పోయాలి. మరికాసేపు మరిగించాక ఐదు నిమిషాలు చల్లార్చాలి. చల్లారిన జ్యూస్​ని గాజు గ్లాస్​ల్లో పోసి ఫ్రిజ్​లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి వాటిని ముక్కలుగా కోయాలి. ఆ ముక్కల్ని కొబ్బరి పొడిలో దొర్లించాలి. చూడ్డానికి కలర్​ఫుల్​గా.. తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ డెజర్ట్​. 

 మిల్క్​షేక్

కావాల్సినవి :

పుచ్చకాయ ముక్కలు - ఒక కప్పు
తులసి లేదా సబ్జా గింజలు - ఒక టేబుల్ స్పూన్
చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు
పాలు - ఒకటిన్నర కప్పు
వెనీలా ఐస్​క్రీమ్ - ఒక స్కూప్

తయారీ : గిన్నెలో తులసి లేదా సబ్జా గింజలు వేసి, నీళ్లు పోసి నానబెట్టాలి. మిక్సీజార్​లో పుచ్చకాయ ముక్కలు, చక్కెర వేసి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నానబెట్టిన తులసి లేదా సబ్జా గింజలు, కొన్ని పుచ్చకాయ ముక్కల్ని ఒక గ్లాస్​లో వేయాలి. మిక్సీ పట్టిన మిల్క్​ షేక్​ అందులో పోసి స్ట్రాతో బాగా కలపాలి. దానిపై వెనీలా ఐస్​క్రీమ్​ పెట్టాలి. అంతే.. డెలీషియస్​గా ఉండే వాటర్ మెలన్ మిల్క్​ షేక్ రెడీ. 

పుడ్డింగ్

కావాల్సినవి :

పుచ్చకాయ ముక్కలు - మూడు కప్పులు
కస్టర్డ్ పౌడర్ - పావు కప్పు
చక్కెర - పావు కప్పు
వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్

తయారీ : మిక్సీజార్​లో పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి, జ్యూస్​ వడకట్టాలి. ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసి రెండు కప్పుల పుచ్చకాయ జ్యూస్​ పోసి బాగా కలపాలి. మరో గిన్నెలో ఒక కప్పు పుచ్చకాయ జ్యూస్​ పోసి చక్కెర వేసి కలపాలి. ఐదు నిమిషాలు బాగా ఉడికించి, అందులో కస్టర్డ్ పౌడర్ మిశ్రమం పోసి కలపాలి. తర్వాత వెనీలా ఎసెన్స్ కూడా వేసి మరికాసేపు ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడ్డాక ఒక ప్లేట్​లోకి తీయాలి. పూర్తిగా చల్లారేవరకు దాన్ని పక్కన ఉంచాలి. తరువాత ఫ్రిజ్​లో పెట్టి ఒక గంట తర్వాత తీస్తే కలర్​ఫుల్​ కేక్​లా కనిపిస్తుంది. దాన్ని ప్లేట్​లో బోర్లించి,  ముక్కలు కట్ చేసుకుని తినడమే.

హల్వా

కావాల్సినవి :

పుచ్చకాయ - ఒకటి 
కార్న్​ ఫ్లోర్ - అర కప్పు

చక్కెర - అర కప్పు

నెయ్యి - ఒక టీస్పూన్
జీడిపప్పు తరుగు - ఒక టేబుల్ స్పూన్​

యాలకులు - రెండు 
చక్కెర - ఒకటిన్నర టీస్పూన్
నల్ల నువ్వులు - సరిపడా

తయారీ : పుచ్చకాయ ముక్కల్ని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి, జ్యూస్​ వడకట్టాలి. ఆ జ్యూస్​లో కార్న్​ఫ్లోర్, చక్కెర వేసి బాగా కలపాలి. నెయ్యి వేడి చేసి జీడిపప్పు తరుగు వేగించాలి. అదే నెయ్యిలో పుచ్చకాయ మిశ్రమం పోయాలి. యాలకులు, చక్కెర కలిపి గ్రైండ్​ చేసి, ఆ పొడిని కూడా ఇందులో వేసి కలపాలి. అలా కాసేపు మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించాలి. దగ్గర పడ్డాక నెయ్యి, వేగించిన జీడిపప్పు తరుగు కలపాలి. ఒక ప్లేట్​కి నెయ్యి పూసి అందులో హల్వా మిశ్రమం వేసి సమానంగా పరవాలి. దానిపై నల్ల నువ్వులు చల్లి, పక్కన పెట్టాలి. ఆరు గంటలు చల్లారాక ఆ ప్లేట్​ని మరో ప్లేట్​లోకి బోర్లించాలి.

టాంగులు

కావాల్సినవి :

పుచ్చకాయ - ఒకటి
చక్కెర - అర కప్పు
నీళ్లు - సరిపడా

తయారీ : పుచ్చకాయ శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. తర్వాత ఐస్​క్రీమ్​ వేసే చిన్న సైజ్​ స్కూప్లతో పుచ్చకాయ నుంచి గుండ్రని స్కూప్స్​ తీయాలి. నాలుగు స్కూప్​లను నాలుగు పుల్లలకు గుచ్చాలి. పాన్​లో చక్కెర వేసి నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత పుచ్చకాయ స్కూప్​లు ఉన్న పుల్లలను వేడి వేడి చక్కెర పాకంలో ముంచాలి. ఆ తర్వాత ఒక గ్లాస్​లో ఐస్​ ముక్కలు, చల్లటి నీళ్లు పోయాలి. పాకంలో ముంచిన పుల్లల్ని తీసి వెంటనే ఐస్​ వాటర్​లో పెడితే వాటర్​ మెలన్ టాంగులు రెడీ. కాసేపటి తర్వాత వాటిని తీసి తింటే ఒకలాంటి అడ్వెంచరస్​ టేస్ట్​ నోటికి అందుతుంది.