కులగణన చేయాల్సిందే..బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి

  • బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి
  • ఆల్ పార్టీ మీటింగ్ లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు

హైదరాబాద్, వెలుగు : రాష్ర్టంలో కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు  42 శాతానికి పెంచాలని వివిధ పార్టీల నేతలు, వక్తలు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. కులగణన చేపట్టిన తరువాతే రిజర్వేషన్లు పెంచాలన్నారు. గురువారం లక్డీకపూల్ లోని ఓ హోటల్ లో “ సమగ్ర కుల గణన వెంటనే ప్రారంభించి బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి ”అనే డిమాండ్ తో ఆల్ పార్టీల మీటింగ్ జరిగింది. ఈ మీటింగులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీజేఎస్, బీఎస్పీ నేతలతోపాటు బీసీ సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు.

 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నేతలు విక్రమ్ గౌడ్, బాలగోని బాలరాజు గౌడ్ , మాజీ ఎంపీ వి.హనుమంతరావు హాజరై, మాట్లాడారు.

బీసీలు ఐక్యంగా ఉండాలి

కులాల్ని పక్కన పెట్టి బీసీలు ఐక్యంగా ఉండాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లొచ్చాక ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు.  కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అనంద్ గౌడ్ కోరారు. ఐక్యంగా ఉంటే అసెంబ్లీ, పార్లమెంట్ లో బీసీలే ఉంటారని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక ఓబీసీలకే ఎక్కువ కేంద్రమంత్రి పదవులు దక్కాయనిన్నారు.

 కులగణన చేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ర్టంలో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. గత ప్రభుత్వం ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, నెల రోజుల్లోనే కులగణన పూర్తవుతుందని వివరించారు.పీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.12వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీల్లో  60 శాతం మంది బీసీలే గెలుస్తారని జాజుల జోస్యం చెప్పారు.కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

గణన చేపట్టకపోతే పార్టీలకతీతంగా  సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలకు దిగాలని పిలుపునిచ్చారు. కులగణన అనేది బీసీల జన్మహక్కని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదన చారి అన్నారు. స్వాతంత్ర్య్ం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతోందని..వారిని అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్  చిరంజీవులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 51 శాతం జనాభా ఉన్న బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కూడా లేవన్నారు. బిహార్ లో 5 వారాల్లోనే కులగణన చేశారని, సమగ్ర సర్వే ఒక్క రోజులో చేశారని వివరించారు. కులగణన చాలా టైం పడుతుందని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై బీసీల రిజర్వేషన్ల పెంపుకు కృషి చేయాలని చిరంజీవులు సూచించారు.