- ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన వివిధ పార్టీల నాయకులు
- రిజర్వేషన్ల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న కమిషనర్
- పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల లీడర్లతో ముగిసిన ఈసీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచాకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పారు. పంచాయతీల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి, సెక్రటరీ అశోక్ కుమార్ ఈసీ ఆఫీసులో శనివారం మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కమిషనర్ ముందు ప్రస్తావించారు. అలాగే, ప్రతి కిలో మీటర్ పరిధిలో ఒక పోలింగ్ స్టేషన్, ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లన్నీ ఒకే వార్డు పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, రిజర్వేషన్ల అంశం రాష్ట్ర సర్కారు పరిశీలనలో ఉన్నందున దానిపై తామేమీ మాట్లాడలేమని కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపారు. మీటింగ్ తర్వాత పార్టీల లీడర్లు మీడియాతో మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: కోదండరెడ్డి
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత కోదండరెడ్డి స్పష్టం చేశారు. కులగణన కేవలం ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదని, అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలన్నారు.
బీసీగణన తర్వాతే ముందుకెళ్లాలి: నర్సింహారెడ్డి
బీసీగణన తర్వాతే ప్రభుత్వం, ఈసీ ఎన్నిలపై ముందుకెళ్లాలని సీపీఎం నేత నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తరువాత ఈసీ ప్రక్రియ కొనసాగించాలన్నారు. ఒక ప్రజాప్రతినిధికి ఒక ఓటే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల హామీని కాంగ్రెస్ నెరవేర్చాలి: బాలరాజు
స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు డిమాండ్ చేశారు. బీసీ కులగణన జరిగిన తరువాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఈసీకి స్పష్టం చేశారు.
సీఎం మాట నిలబెట్టుకోవాలి: రామచంద్రారెడ్డి
బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బీసీ జనగణన జరిగిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలన్నారు. గ్రామ పంచాయతీల నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.
రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టాలి: పల్లా వెంకట్
రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. వార్డుల విభజన సక్రమంగా చేయాలన్నారు. బీసీ జనగణన చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు.