కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత బీజేపీపై అంచనాలు మారుతున్నాయా?

కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత బీజేపీపై అంచనాలు మారుతున్నాయా?

తెలంగాణలో బీజేపీ క్షీణిస్తున్నదని, ఎదగడం లేదని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గెలుపు ఓటమిలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు విషయాలను సూచిస్తాయి. తాను గెలవాల్సిన అవసరం లేదని, కానీ తన శత్రువులు గెలవకపోతే తాను విజయం సాధించవచ్చనే వారు ఉంటారు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే అది కొందరికి గెలుపు, మరికొందరికి ఓటమి. ఉదాహరణకు ఉక్రెయిన్ -రష్యా యుద్ధాన్ని తీసుకోండి. వారంలో ఉక్రెయిన్ లొంగిపోతుందని రష్యా అనుకుంది. కానీ యుద్ధం కొనసాగుతున్నది. ప్రపంచం ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ను విజేతగా చూస్తున్నది.

పార్టీపై అంచనాలు

2014 నుంచి భారతదేశంలో ప్రతిచోటా బీజేపీ పెరుగుతోంది. 2019 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించింది. తెలంగాణలోనూ 4 చోట్ల గెలిచింది. కాబట్టి ప్రజలు తెలంగాణలో బీజేపీపై కొంత ఆశతో ఉన్నారు.  కేంద్ర బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై ఫోకస్​పెట్టడం.. మోడీ, షా, నడ్డాల పర్యటనలతో రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పాత్రపై అంచనాలు పెరిగాయి. రాష్ట్ర బీజేపీ కూడా హైపర్ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. 2018 ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల త‌‌‌‌‌‌‌‌ర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీలోకి ఫిరాయించ‌‌‌‌‌‌‌‌డంతో ఆ పార్టీపై కొంత విశ్వాసం సన్నగిల్లింది. సహజంగానే, తెలంగాణలో బీజేపీ ఎదుగుదల, కొన్ని ఉపఎన్నికలు గెలుపొందడంతో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల చరిత్ర ఒకసారి చూస్తే.. 

విజయానికి సమయం పడుతుందనేది సుస్పష్టం.1983లో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌, 2012లో కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌ పార్టీలు స్థాపించిన ఏడాదిలోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారని అనొచ్చు. కానీ ప్రతి నియమానికి మినహాయింపు ఉంటుంది కదా? కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పొందడానికి అయిదు దశాబ్దాలు పట్టింది. అలాగే నేటి బీజేపీకి ముందున్న జనసంఘ్ 1951లో ఏర్పడితే.. 1977లో తొలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ అది మాత్రమే1991లో ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.1998లో అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయి నేతృత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి డీఎంకేకు 40 ఏండ్లు పట్టింది.

అధికారాన్ని  కైవసం చేసుకుంటుందా?

తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ, ఆంధ్రా ప్రత్యేక ప్రయోజనాలను సమన్వయం చేసుకోవడం కష్టతరమైనందున బీజేపీ పెద్దగా ఎదగలేకపోయింది. కానీ తెలంగాణలో 2014 నుంచి చురుగ్గా పనిచేస్తున్నది. 2018లో తెలంగాణలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీటుతోపాటు, 7%  ఓట్లు వచ్చాయి. 2019 నాటికి 4 ఎంపీ స్థానాలు, 20 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి రెండు కీలక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 2023 తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సాధించడమే లక్ష్యం. అయితే చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడమే కాదు.. బీజేపీకి విజయం అంటే అది ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఆపగలగడం కూడా.

కొంత సమయం తప్పదా?

కేరళ, తమిళనాడులో బీజేపీ పోటీ చేసినా గెలవలేకపోతున్నదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ కేరళలో బీజేపీకి దాదాపు15% ఓట్లు వచ్చాయి. 15 శాతమంటే తక్కువేం కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేవలం 15% ఓట్లనే పొంది ఒక పెద్ద నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు కదా? స్థిరంగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక రాజకీయ పార్టీ అభివృద్ధి చెందుతుంది. కేరళ తదితర రాష్ట్రాల్లో విశ్వాసపాత్రులైన ఓటర్లతో పాతుకుపోయిన పార్టీలు ఉన్నాయి. అలాంటి నమ్మకమైన ఓటర్లను మార్చడం కష్టం. అలాంటి చోట్ల కొత్త ఓటర్లను, మెజారిటీని సాధించడానికి బీజేపీకి కొంత సమయం పడుతుంది. బెంగాల్‌‌‌‌‌‌‌‌, అస్సాం, ఒడిశాలో 25 ఏండ్లుగా బీజేపీ యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. పాత ఓటర్లు బయటకు వెళ్లడంతో కొత్త పార్టీకి అవకాశం దక్కింది. తెలంగాణలో బీజేపీ తన ప్రయత్నాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తే విజయం ఖాయం. 2019లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు 40 శాతం, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 24 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. బీజేపీకి 20% వచ్చాయి. ఇది మంచి పెరుగుదల. బీజేపీ మెల్లగా యువ ఓటర్లను చేజిక్కించుకోవాలి
.
నాయకులు వస్తారు.. పోతారు  తెలంగాణలో కామెడీ

ఇటీవల బీజేపీ రాష్ట్ర పార్టీలో పలువురు నాయకులు స్పందిస్తూ.. తెలంగాణలో బీజేపీ స్థానం, పాత్రపై మాట్లాడుతున్నారు. దీంతో పార్టీపై ప్రజలు, కార్యకర్తల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటివి అవతలి పార్టీకి బలంగా ఉపయోగపడతాయి. కాబట్టి పార్టీ నాయకత్వం ‘పాలీ-ట్రిక్స్’పై దృష్టి పెట్టే బదులు సాధారణ కార్యకర్తలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఓటర్లు ‘పెయిడ్ వర్కర్స్’గా మారాలనుకుంటున్నారు. ఒక నిజాయితీపరుడైన కార్యకర్త100 మంది పెయిడ్​కార్యకర్తలతో సమానం. కాబట్టి కొత్త కార్యకర్తలను చేర్చుకోవడం, వారిని పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలం చేయడంపై ఫోకస్​పెట్టాలి. తెలంగాణ బీజేపీకి ‘కొత్త సభ్యుల చేరికల కమిటీ’ ఎలాగూ ఉన్నది. 

‘వీడ్కోలు కమిటీ’ ఏర్పాటు చేయడం కూడా మంచిదే. ఉద్యోగులు అతిపెద్ద కంపెనీలను విడిచిపెట్టినప్పుడు, కంపెనీని మార్చడానికి వీలుగా వారు ఎందుకు వెళ్లిపోతున్నారో చెప్పాలని వారిని మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తుంటారు. అలాగే ‘వీడ్కోలు కమిటీ’ని ఏర్పాటు చేసి, ఏ నాయకుడైనా వెళ్లిపోవాలనుకుంటే బెస్ట్​ఆఫ్​లక్​చెప్పి సూచనలు తీసుకోవాలి తప్ప.. ఎక్కువ ప్రయాస అవసరం లేదు.

–డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్