
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని 1,756 సర్క్యూట్ కిలోమీటర్లు విస్తరించిన వరోరా కర్నూల్ ట్రాన్స్‌మిషన్ లైన్ ను (డబ్ల్యూకేటీఎల్) అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రారంభించింది. వెస్ట్రన్ రీజియన్, సదరన్ రీజియన్‌ల మధ్య 4,500 మెగా వాట్ల కరెంట్ ఫ్లో అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ సాయపడుతుందని ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అంతేకాకుండా పెద్ద సైజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్‌లకు ఈ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కనెక్ట్ చేయొచ్చని వెల్లడించింది.
వరోరా కర్నూల్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌ను 2015 లో ఏర్పాటు చేశారు. వరోరా– వరంగల్, చిలకలూరిపేట – హైదరాబాద్ – కర్నూల్ మధ్య కరెంట్ ఫ్లో కోసం ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ను ఏర్పాటు చేయడం ఈ కంపెనీ టార్గెట్. ఇందుకోసం వరంగల్‌లో 765/400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీని 2021 లో అదానీ ఎనర్జీ కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో టవర్ల ఏర్పాటుకు 1,03,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వాడారు.