పాలమూరు వర్సిటీలో.. ఔషధ మొక్కల పెంపకం

పాలమూరు వర్సిటీలో..  ఔషధ మొక్కల పెంపకం
  • 24 ఎకరాల్లో 200 జాతులకు చెందిన వెయ్యి మొక్కలు
  • నేషనల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ నుంచి రూ.10 లక్షలు విడుదల
  • బాటనీ స్టూడెంట్లకు సంరక్షణ బాధ్యతలతో పాటు అవగాహన

మహబూబ్‌‌‌‌నగర్/మహబూబాబ్‌‌‌‌రూరల్​, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్లకు చదువుతో పాటు ఔషధ మొక్కల పెంపకంపైనా ప్రొఫెసర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం వర్సిటీలో ప్రత్యేకంగా ఔషధ మొక్కల గార్డెన్‌‌‌‌ను కూడా ఏర్పాటు చేశారు. వాటి వల్ల కలిగే లాభాలను స్టూడెంట్లకు వివరిస్తూ, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన సలహాలు కూడా ఇస్తున్నారు. మరో వైపు సహజసిద్ధంగా పెరిగే ఔషధ మొక్కలపై రైతులకు కూడా అవగాహన కల్పించేందుకు వర్సిటీ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు.

24 ఎకరాల విస్తీర్ణంలో..

పాలమూరు యూనివర్సిటీలో ఔషద మొక్కల పెంపకం కోసం 24 ఎకరాలను కేటాయించారు. ఇందులో వర్సిటీలోని సైన్స్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ వద్ద ఉన్న రెండు ఎకరాలను మెడిసిన్‌‌‌‌ ప్లాంట్ గార్డెన్‌‌‌‌ కోసం, వీసి రెసిడెన్సీ ఛాంబర్‌‌‌‌ ఆవరణలో ఉన్న 20 ఎకరాలను జీవవైవిధ్యాలకు సంబంధించిన మొక్కల కోసం, ఎగ్జామినేషన్‌‌‌‌ బ్రాంచ్ వద్ద ఉన్న మరో రెండు ఎకరాలను సహజ సిద్ధంగా పెరిగే మెడిసినల్‌‌‌‌ ప్లాంట్స్‌‌‌‌ కోసం కేటాయించారు. ఔషద మొక్కల పెంపకాన్ని ఏడాది కిందే ప్రారంభించగా మొదట 120 రకాల మొక్కలను హైదరాబాద్‌‌‌‌ నుంచి తెప్పించారు. 

ప్రస్తుతం 200 రకాలకు చెందిన సుమారు వెయ్యి మొక్కలను పెంచుతున్నారు. వీటి సంరక్షణ కోసం ఇటీవల ప్రభుత్వం రూ.10 లక్షలను కేటాయించింది. మొక్కలను పూర్తిగా ఆర్గానిక్‌‌‌‌ పద్ధతిలో సాగు చేస్తూ డ్రిప్‌‌‌‌ ద్వారా నీటిని అందిస్తున్నారు. బాటనీ ప్రొఫెసర్‌‌‌‌ ఆధ్వర్యంలో స్టూడెంట్ల పర్యవేక్షణలో ఈ గార్డెన్‌‌‌‌ నిర్వహణ చేపట్టారు. ఈ మొక్కలకు సంబంధించి పూర్తి అవగాహన కోసం స్టూడెంట్లతో ప్రయోగాలు చేయిస్తున్నారు. 

లాభాలెన్నో...

వర్సిటీలో పెంచుతున్న మొక్కల్లో చాలా వాటిని మెడిసిన్స్‌‌‌‌, సబ్బులు, కాస్మొటిక్స్‌‌‌‌ తయారీలో వాడుతారని ప్రొఫెసర్లు తెలిపారు. తిప్ప తీగ (అమృతవల్లి) సర్వరోగ నివారిణిగా పని చేస్తుందని, ఈ తీగ ఆకులను రోజూ రెండు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే గిలగనేరు మొక్క పువ్వులను గ్లాస్‌‌‌‌ నీళ్లలో వేసుకొని వేడి చేసుకొని తాగితే క్యాన్సర్‌‌‌‌ నివారణిగా పనిచేస్తుందంటున్నారు. అడవి నాభి గడ్డ కేజీ రూ. లక్షల్లో పలుకుతుందని, ఎనిమిది రోజులు మాత్రమే నిల్వ ఉండే ఈ గడ్డను వివిధ రకాల రోగాల నివారణకు వాడుతారని తెలిపారు. 

రణపాల రకం మొక్కలను ముక్కు, శ్వాసకోశ వ్యాధులను నయం చేయడానికి, పంచ పాండవుల తీగను నిద్రలేని సమస్యకు, ఒంటి నొప్పులకు ఔషదంగా వాడుతారని, నల్లేరు మొక్కను ఎముకలను బలంగా చేయడానికి, విరిగిన ఎముకలను అతకడానికి ఔషధంగా వాడుతుంటారని వివరించారు. ఉత్తరేగి (స్టా కీటర్ పేట) మొక్కలు ఉంటే పరిసరాల్లోకి పాములు రావని, శంఖపుష్పం రక్తాన్ని శుద్ధి చెస్తుందని, మద్ది చెట్టు హార్ట్‌‌‌‌ అటాక్‌‌‌‌, పెరాలసిస్‌‌‌‌ను నివారించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అడవి బాదం మొక్క విత్తనాల నుంచి తీసిన నూనెను చర్మవ్యాధుల నివారణకు, సోప్స్‌‌‌‌, కాస్మొటిక్స్‌‌‌‌ తయారీకి వాడుతారని ప్రొఫెసర్లు తెలిపారు.

వర్సిటీలో సంరక్షిస్తున్న మెడిసినల్‌‌‌‌ ప్లాంట్స్‌‌‌‌

అడవి పాలతీగ, అడ్డసరము, కలబంద, అవిస, బాదిశ, భద్రాక్షి, బండి గురివింద, భాసుమతి పాండన్, బెల్ల గన్నేరు, చిన్నాకు, కాలాబాష, చంద్రకాంత, చిల్ల, చిన్న ఉసిరి, దేవ గన్నేరు, దుంపరాష్ట్రం, ఎద్దుమూతి దుంప, ఫీగంజీర్, గజ్జకాయ, గాజ్‌‌‌‌బీఫల్‌‌‌‌, గంధ రసం, గన్నేరు, కాసర తీగ, కస్తూరి, కొండ జమిడి, కొండ పాపిడి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, లవంగి తులసి, కుండేటి చెవి, కుంకుడు, నిమ్మ గడ్డి, నిమ్మి సబ్జి, మాచిపత్రి, మారేడు, మిరియాలు, మోదుగ, ముద్ద మందారం, నాగమళ్లి, ఉసిరి, వెలగ తదితర మొక్కలు ఉన్నాయి.

మెడిసినల్‌‌‌‌ ప్లాంట్స్‌‌‌‌పై అవగాహన పెంచుకోవాలి

వర్సిటీలోని ఔషధ మొక్కల్లో ఎక్కువ భాగం బయట సాధారణంగా కనిపించేవే. కానీ ఆ మొక్కల గురించి ఎవరికీ తెలియదు. వీటిని ప్రజలు కూడా పిచ్చి మొక్కలుగా భావిస్తుంటారు. వాటిపై అవగాహన పెంచుకుంటనే వాటి వల్ల కలిగే లాభాలు తెలుస్తాయి.

పి.శివకుమార్ సింగ్, బొటని ప్రొఫెసర్​, పీయూ