క్రికెట్‌‌‌‌కు ఆరోన్‌‌ అల్విదా

న్యూఢిల్లీ : ఇండియా పేసర్‌‌‌‌‌‌‌‌, ఒకప్పుడు దేశంలోనే ఫాస్టెస్ట్‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న  వరుణ్ ఆరోన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియాకు దూరమై కొన్నేండ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్న వరుణ్ ఇప్పుడు అన్ని రకాల ఆట నుంచి తప్పుకున్నాడు.  విజయ్ హజారే ట్రోఫీలో తన స్టేట్‌‌‌‌  టీమ్ జార్ఖండ్ ఓడిపోయిన తర్వాత వరుణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏండ్ల  వరుణ్​ టీమిండియాలోకి వచ్చిన  కొత్తలో తన మెరుపు వేగంతో ఆకట్టుకున్నాడు. కానీ, గాయాలు అతడిని దెబ్బకొట్టాయి.

 21 ఏండ్ల వయసులో విజయ్ హజారే ట్రోఫీ 2010–11 సీజన్‌‌‌‌లో వరుణ్ వెలుగులోకి వచ్చాడు గుజరాత్‌‌‌‌తో నాటి ఫైనల్లో 153 కి.మీ వేగంతో బంతి వేసి తన పేస్ పవర్ చూపెట్టాడు. నిలకడగా 150 కి.మీ స్పీడుతో బౌలింగ్‌‌‌‌ చేయడంతో టీమిండియాలోకి వచ్చిన అతను 2011లో ముంబైలో ఇంగ్లండ్‌‌‌‌తో వన్డేలో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అదే వేదికలో వెస్టిండీస్‌‌‌‌ తొలి టెస్టు ఆడాడు. కెరీర్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 9 వన్డేలు, 9 టెస్టులు ఆడిన వరుణ్ 29 వికెట్లు పడగొట్టాడు. 2011 నుంచి 2022 వరకు ఐపీఎల్‌‌‌‌లో పలు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆరోన్ గుజరాత్‌‌‌‌ టైటాన్స్ తరఫున ట్రోఫీ అందుకున్నాడు.