IND vs NZ: పోయిన చోటే వెతుక్కున్నాడు: నాలుగేళ్ల తర్వాత విమర్శకులకు వరుణ్ చక్రవర్తి చెక్

IND vs NZ: పోయిన చోటే వెతుక్కున్నాడు: నాలుగేళ్ల తర్వాత విమర్శకులకు వరుణ్ చక్రవర్తి చెక్

పోయిన చోటే వెతుక్కోవడమంటే ఏమిటో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిరూపించాడు. ఐపీఎల్ లో దుమ్ములేపిన వరుణ్ చక్రవర్తికి తొలిసారి 2021 టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కింది. మిస్టరీ స్పిన్నర్ గా సత్తా చాటతాడనుకుంటే ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి వికెట్ తీయకుండా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ టోర్నీలో మొత్తం ఆడిన మూడు మ్యాటిక్ ల్లో 10 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ లేకుండానే ముగించాడు.

వరుణ్ చక్రవర్తి ప్రదర్శనతో అతనిపై చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టీమిండియా సెలక్షన్ పై ఫ్యాన్స్ తో పాటు ఎక్స్ పర్ట్స్ మండిపడ్డారు. దీంతో ఎంత వేగంగా జట్టులోకి వచ్చాడో అంతే వేగంగా చోటు కోల్పోయాడు. ఇదిలా ఉంటే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో  దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ పై 5 వికెట్లతో చెలరేగాడు. ఆదివారం (మార్చి 2) కివీస్ పై జరిగిన మ్యాచ్ లో భారత్ ఓ మాదిరి స్కోర్ కే పరిమితమైనా.. వరుణ్ బౌలింగ్ తో గెలిచింది. దుబాయ్ వేదికగా 2021 టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పై విమర్శలు తెచ్చుకున్న వరుణ్.. నాలుగేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అదే గడ్డపై.. అదే ప్రత్యర్థిపై 5 వికెట్లు తీసి ప్రశంసలు అందుకున్నాడు. 

ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బుమ్రా గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అనూహ్యంగా సెలక్ట్ అయిన ఈ మిస్టరీ స్పిన్నర్..తొలి రెండు మ్యాచ్ ల్లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. ఇండియా సెమీస్ కు చేరడంతో హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ కు అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 12వ ఓవర్లో ఓపెనర్‌‌ విల్ యంగ్ (22)ను చక్రవర్తి బౌల్డ్ చేసి కీలక బ్రేక్ ఇచ్చాడు.  గ్లెన్‌‌ ఫిలిప్స్ (12), బ్రేస్‌‌వెల్ (2)ను వరుణ్ వరుస ఓవర్లలో ఎల్బీగా ఔట్ చేసి దెబ్బకొట్టాడు.

రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌తో ఎదురుదాడికి దిగిన కెప్టెన్ శాంట్నర్ (28)ను 45వ ఓవర్లో వరుణ్ క్లీన్‌‌బౌల్డ్ చేయడంతో బ్లాక్‌‌క్యాప్స్ టీమ్ ఓటమి ఖాయమైంది. అదే ఓవర్లో భారీ షాట్‌‌కు ట్రై చేసి హెన్రీ (2) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వరుణ్ చక్రవర్తికే లభించింది.