టీమిండియా లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రీ ఎంట్రీ లో సూపర్ ఫామ్ తో చెలరేగుతున్నాడు. తన స్పిన్ వేరియేషన్స్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఈ తమిళ స్పిన్నర్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ అదరగొడుతున్నాడు. తొలి మూడు టీ20ల్లోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. రాజ్ కోట్ వేదికగా మంగళవారం (జనవరి 28) ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లకు పడగొట్టాడు.
12 ఓవర్లు ముగిసేసరికి వంద పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో జోస్ బట్లర్(24), జామీ ఓవర్టన్(0), జామీ స్మిత్(6), బ్రైడన్ కార్సే(6)లను ఇంగ్లీష్ శిబిరంలో అలజడి రేపాడు. దాంతో, ఇంగ్లీష్ జట్టు 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినా వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ALSO READ | Steven Smith: మోడ్రన్ టెస్ట్ హీరో: పదివేల పరుగుల క్లబ్‌లో స్టీవ్ స్మిత్.. రికార్డులు ఇవే!
మిస్టరీ స్పిన్నర్ గా కితాబులందుకుంటున్న వరుణ్.. తనని అలా పిలవద్దని అంటున్నాడు. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతను తనకు మిస్టర్ స్పిన్నర్ అనే ట్యాగ్ ఇవ్వొద్దని తెలిపాడు. వరుణ్ మాట్లాడుతూ.. " నేను మిస్టరీ స్పిన్నర్ కాదు. నేనొక లెగ్ స్పిన్నర్. లెగ్ స్పిన్ లో వేరియేషన్స్ వేస్తాను. మీడియా నాకు మిస్టర్ స్పిన్నర్ అనే ట్యాగ్ ఇచ్చింది. నేను నిలకడగా ఆడడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది. నేను ఇప్పటికీ నాకు 10 కి 7 మార్కులే వేసుకుంటాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది". అని వరుణ్ చక్రవర్తి అన్నాడు.