వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘మట్కా’. నవంబర్ 14న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు.
మార్కెట్ కూలీ నుంచి ‘మట్కా’ కింగ్‌గా ఎదిగిన వాసు అనే సాధారణ అబ్బాయి కథే ఈ చిత్రం. -తను బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్ వస్తాడు. 1958 నుంచి 82 వరకు తను అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు అనేది చూపించాం. -డైరెక్టర్ కరుణ గారు ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చేద్దామని భావించారు. రతన్ ఖత్రి ది ముంబై నేపథ్యం. తను పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. మట్కా గురించి ఆయన చేసిన పనులను జనాలు రూమర్స్‌లా మాట్లాడుకోవడమే తప్పితే కొన్నిటికి ఆధారాలు లేవు. దాన్ని తనదైన ఐడియాస్‌తో కరుణ డిజైన్ చేశారు.
సందేశాత్మక చిత్రం కాదు..
ఇది సందేశాత్మక చిత్రం కాదు. ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిలిం. వాసు క్యారెక్టర్‌లో తనకి ఎవడూ హెల్ప్ చేయడనే ఒక బాధ, కోపం కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తున్న కొద్దీ తను చెప్పేది కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది. కొన్నిసార్లు పాపమనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ మీద కోపం కూడా వస్తుంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ క్యారెక్టరైజేషన్. చాలా స్ట్రాంగ్‌గా రాసిన క్యారెక్టర్ ఇది. మంచి, చెడు అని కాదు.. ఆడియన్స్ థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్‌తో కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ అవ్వాలి, వాడు గెలవాలనుకోవాలి, వాడిని ప్రేమించాలి.. అదే కమర్షియల్ సినిమా ఫార్ములా. అలా చూసుకుంటే వాసు క్యారెక్టర్‌తో ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు.
1960– 70 టైమ్‌లోకి వెళ్తారు. ఇలాంటి గ్యాంగ్‌స్టర్ తరహా సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్. జీవీ ప్రకాష్ స్టన్నింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అందించారు. ఆయన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. డైరెక్టర్ -కరుణ కుమార్ గారి సెన్సిబిలిటీస్ నాకు చాలా నచ్చాయి. ఆయన గ్రౌండ్ రియాలిటీని షుగర్ కోటింగ్ లేకుండా చెబుతుంటారు. ఆయన చాలా మంచి రైటర్. సెట్లో అప్పటికప్పుడే ఇంప్రవైజ్ చేసి చాలా అద్భుతమైన మాటల్ని రాయగలరు. ఇందులో ధర్మం అనే టాపిక్‌పై వచ్చే డైలాగ్ అప్పటికప్పుడు రాసిందే. 'నీకు ఏది అవసరమో అదే ధర్మం' అనే డైలాగ్‌ని ఆయన సెకండ్స్‌లో చెప్పారు. అలాంటి డైలాగులు ఇందులో చాలా ఉన్నాయి. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ వాసుతో పాటు ట్రావెల్ అవుతుంది. తన పాత్రలో ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుంది. అలాగే నోరా ఫతేహి, కన్నడ కిషోర్, జాన్ విజయ్, రాజేష్, నవీన్ చంద్ర ప్రతి ఒక్కరూ మంచి క్యారెక్టర్స్ చేశారు.