రోహిత్ స్ట్రాటజీనా.. మజాకా..? 249 పరుగులే చేసి టీమిండియా ఎలా గెలిచిందంటే..

రోహిత్ స్ట్రాటజీనా.. మజాకా..? 249 పరుగులే చేసి టీమిండియా ఎలా గెలిచిందంటే..
  • వరుణ్ మ్యాజిక్‌‌ .. 249 స్కోరును కాపాడుకున్న ఇండియా.. 
  • ఐదు వికెట్లతో వరుణ్ చక్రవర్తి విజృంభణ 
  • 44  రన్స్ తేడాతో న్యూజిలాండ్‌‌పై విజయం
  • హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్‌‌–ఎలో టాప్ ప్లేస్‌
  • మంగళవారం (మార్చి4) ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఫైట్‌‌

దుబాయ్‌‌: తన రెండో వన్డేలోనే  మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/42) స్పిన్ మ్యాజిక్‌‌తో ఐదు వికెట్లతో విజృంభించాడు. దాంతో  చిన్న టార్గెట్‌‌ను కాపాడుకున్న టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది. శనివారం జరిగిన చివరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో  44 రన్స్‌‌ తేడాతో బలమైన  న్యూజిలాండ్‌‌ను ఓడించి గ్రూప్‌‌–ఎ టాపర్‌‌‌‌గా నాకౌట్ ఫైట్‌‌కు సిద్ధమైంది. ఈ లో స్కోరింగ్ పోరులో  తొలుత ఇండియా 50 ఓవర్లలో 249/9 స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (98 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 79) సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా (45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), అక్షర్ పటేల్ (61 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 42) ఆకట్టుకున్నారు. 

కివీస్ పేసర్ మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌లో న్యూజిలాండ్  45.3 ఓవర్లలో 205 రన్స్‌‌కే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (120 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 81) ఒంటరి పోరాటం సరిపోలేదు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.  చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. మంగళవారం దుబాయ్‌లో జరిగే తొలి సెమీస్‌‌లో ఆస్ట్రేలియాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం లాహోర్‌‌లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది.

37.3 ఓవర్లు స్పిన్ దాడి.. 

చిన్న స్కోరును కాపాడే క్రమంలో ఇండియా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఆరో ఓవర్‌‌‌‌ నుంచే స్పిన్నర్లను రంగంలోకి దింపిన రోహిత్‌‌.. కివీస్‌‌పై ఒత్తిడి పెంచాడు. 9 నుంచి 31వ ఓవర్ వరకూ ఏకధాటిగా..  ఇన్నింగ్స్​ మొత్తంలో 37.3  ఓవర్లు నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్‌‌ చేయించి ఫలితం రాబట్టాడు.అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన వరుణ్  చక్రవర్తి తన స్పిన్‌‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. తొలుత గత మ్యాచ్ సెంచరీ హీరో రచిన్ రవీంద్ర (6)ను నాలుగో ఓవర్లో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చి తొలి దెబ్బ కొట్టగా.. 12వ ఓవర్లో ఓపెనర్‌‌ విల్ యంగ్ (22)ను చక్రవర్తి బౌల్డ్ చేసి కీలక బ్రేక్ ఇచ్చాడు. 

అంతకుముందు ఓవర్లో కీపర్ రాహుల్ క్యాచ్ వదిలేయడంతో 17 రన్స్ వద్ద లైఫ్ దక్కించుకున్న కేన్ విలియమ్సన్ జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు.  డారిల్ మిచెల్ (17) కూడా నింపాదిగా ఆడటంతో సగం ఓవర్లకు కివీస్ 93/2 స్కోరు మాత్రమే చేసింది.  క్రీజులో కుదుకున్న డారిల్‌‌ను ఎల్బీ చేసిన కుల్దీప్‌‌ మూడో వికెట్‌‌కు 44  రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. జడ్డూ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌తో ఫిఫ్టీ (77 బాల్స్‌‌లో) పూర్తి చేసుకున్న కేన్ క్రీజులో పాతుకుపోయినా సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది.  మరో ఎండ్‌‌లో అతనికి సరైన సహకారం కూడా లభించలేదు. కాసేపు ప్రతిఘటించిన లాథమ్ (14)ను జడేజా పెవిలియన్ చేర్చగా..  గ్లెన్‌‌ ఫిలిప్స్ (12), బ్రేస్‌‌వెల్ (2)ను వరుణ్ వరుస ఓవర్లలో ఎల్బీగా ఔట్ చేసి దెబ్బకొట్టాడు.  

సెంచరీ చేసేలా కనిపించిన కేన్‌‌.. జడేజా బౌలింగ్‌‌లోస్టంపౌటవ్వడంతో  న్యూజిలాండ్ 169/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌తో ఎదురుదాడికి దిగిన కెప్టెన్ శాంట్నర్ (28)ను 45వ ఓవర్లో వరుణ్ క్లీన్‌‌బౌల్డ్ చేయడంతో బ్లాక్‌‌క్యాప్స్ టీమ్ ఓటమి ఖాయమైంది. అదే ఓవర్లో భారీ షాట్‌‌కు ట్రై చేసి హెన్రీ (2) కోహ్లీకి క్యాచ్ ఇవ్వగా..  కుల్దీప్ బౌలింగ్‌‌లో ఒరూర్క్ (1) బౌల్డ్ అవ్వడంతో కివీస్ పోరాటం ముగిసింది.

ఆదుకున్న శ్రేయస్‌‌, అక్షర్‌‌‌‌, పాండ్యా

వరుసగా 13వ వన్డేలో టాస్ ఓడిన ఇండియా మొదటగా బ్యాటింగ్‌‌కు రాగా.. తొలి పవర్ ప్లేలో కివీస్ పేసర్లు హడలెత్తించారు.  స్లో వికెట్‌‌పై కొత్త బాల్‌‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్‌‌మన్ గిల్ (2 ), విరాట్ కోహ్లీ (11) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఓ దశలో 30/3తో ఇండియా డీలా పడింది. ఫామ్‌‌లో ఉన్న గిల్‌‌ను రెండో ఓవర్లోనే ఎల్బీ చేసిన హెన్రీ తొలి దెబ్బకొట్టాడు. అతని బౌలింగ్‌‌లో ఫోర్, సిక్స్‌‌తో అలరించిన రోహిత్.. జెమీసన్ వేసిన ఆరో ఓవర్లో పుల్‌‌ షాట్‌‌కు ట్రై చేసి విల్ యంగ్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. 

ఆ వెంటనే హెన్రీ బాల్‌‌ను కట్‌‌ షాట్ ఆడిన కోహ్లీ.. బ్యాక్‌‌వర్డ్ పాయింట్‌‌లో ఫిలిప్స్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌‌కు పెవిలియన్ చేరాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నారు. తొలుత వీళ్లు జాగ్రత్త పడటంతో 16 ఓవర్లకు కానీ ఇండియా స్కోరు 50 దాటలేదు. క్రీజులో కుదురుకున్న తర్వాత శ్రేయస్‌‌, అయ్యర్ బ్యాట్లకు పని చెప్పి బౌండ్రీలు కొట్టారు. దాంతో 25వ ఓవర్లో స్కోరు వంద దాటగా.. శ్రేయస్ 75 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌‌లో అతనికి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన అక్షర్.. రచిన్ వేసిన 30వ ఓవర్లో  స్కూప్ షాట్‌‌కు ట్రై చేసి విలియమ్సన్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌‌కు 98 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ అయింది.  

సెంచరీ చేసేలా కనిపించిన శ్రేయస్.. ఒరూర్క్ బౌలింగ్‌‌లో పుల్ షాట్‌‌ ఆడబోయి కవర్స్‌‌లో యంగ్‌‌కు యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరో నంబర్‌‌‌‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (23) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. రచిన్ బౌలింగ్‌‌లో లాంగాన్ మీదుగా సూపర్ సిక్స్ కొట్టాడు. కానీ, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్‌‌లో కీపర్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అయితే స్లాగ్ ఓవర్లలో పాండ్యా జట్టును ఆదుకున్నాడు. జడేజా (16)తో ఏడో వికెట్‌‌కు 41, షమీ (5)తో ఎనిమిదో వికెట్‌‌కు 23 రన్స్ జోడించి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. 

తల్లి మృతితో స్వదేశానికి  ఇండియా టీమ్‌‌ మేనేజర్‌‌ దేవరాజ్‌‌

ఈ టోర్నీలో ఇండియా టీమ్ మేనేజర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న హెచ్‌‌సీఏ సెక్రటరీ ఆర్‌‌‌‌. దేవరాజ్‌‌ స్వదేశానికి తిరిగొచ్చాడు. ఆదివారం ఉదయం తన తల్లి కమలేశ్వరి మృతి చెందిన వార్త తెలియడంతో  వెంటనే హైదరాబాద్‌‌కు వచ్చేశాడు. దేవరాజ్‌‌ తిరిగి మేనేజర్‌‌‌‌ బాధ్యతలు చేపడుతాడా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 50 ఓవర్లలో 249/9 (శ్రేయస్ అయ్యర్ 79, హార్దిక్ 45, హెన్రీ 5/42).
న్యూజిలాండ్‌‌:  45.3 ఓవర్లలో 205 ఆలౌట్‌‌ (విలియమ్సన్ 81, వరుణ్ చక్రవర్తి 5/42)