‘మా ఊరిని దత్తత తీసుకున్న సీఎం కేసీఅర్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన్రు. ఎంత ఎదురు చూసినా ఫాయిదా ఉంటలేదు. సర్కారు కట్టకుంటే మేమే ఇండ్లు కట్టుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి’’- యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతికి వాసాలమర్రి పంచాయతీ పాలకవర్గం వినతి
యాదాద్రి, వెలుగు: ‘‘మా ఊరిని దత్తత తీసుకున్న సీఎం కేసీఅర్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన్రు. ఇండ్ల కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నాం. సర్కారు కట్టకుంటే మేమే ఇండ్లు కట్టుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి’’ అంటూ వాసాలమర్రి గ్రామ పాలకవర్గం యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం సమర్పించింది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకోక ముందు వాసాలమర్రికి ఆఫీసర్ల తాకిడి తక్కువే. ఆ తర్వాత అన్ని డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లు గ్రామానికి క్యూ కట్టారు. గ్రామంలో సమస్యలు ఏమున్నయో అడిగి తెలుసుకున్నారు. నిరుడు జులైలో ఇండ్ల నిర్మాణం సహా అన్ని అభివృద్ధి పనుల కోసం రూ.165 కోట్లతో సీఎంకు డీపీఆర్ అందించారు. గ్రామాన్ని సీఎం దత్తత తీసుకుని రెండేండ్లు గడిచింది. రెండోసారి డీపీఆర్ అందించి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదు. పైగా ఏడాది కాలంగా ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై సీఎస్ సోమేశ్ కుమార్ యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పై సీరియస్ అయ్యారు. దీంతో జిల్లా ఆఫీసర్లు మరోసారి రంగంలోకి దిగి ఈసారి డిపార్ట్ మెంట్ల వారీగా అభివృద్ధి పనులకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు పంపించారు. మొదటి విడతలో గవర్నమెంట్ సెక్టార్ లోని పనులకు రూ.58 కోట్లు ఖర్చవుతాయని లెక్కలు పంపించారు. రెండు నెలలు గడిచినా అడుగు ముందుకు పడలేదు. దీంతో వాసాలమర్రి సర్పంచ్ ఆంజనేయులు సహా పాలకవర్గం సోమవారం కలెక్టర్ సత్పతిని ప్రజావాణిలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎమ్మెల్యేను కలిశారా? అని ప్రశ్నించిన కలెక్టర్
తనకు వినతిపత్రం ఇచ్చిన వాసాలమర్రి పాలకవర్గాన్ని ఊహించని విధంగా కలెక్టర్ పమేలా సత్పతి ‘‘ఆలేరు ఎమ్మేల్యేను కలిశారా?’’ అంటూ ప్రశ్నించారు. దీంతో పాలవర్గం ఆశ్చర్యానికి లోనయ్యింది. గతంలో మీరు చెప్పిన విధంగా కలిశామని, సంక్రాంతి పండుగ తర్వాత అడుగు ముందుకు పడుతుందని చెప్పారని కలెక్టర్ కు సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు. ప్రజల నుంచి ఇండ్ల నిర్మాణం కోసం ఒత్తిడి వస్తున్నదని చెప్పిన సర్పంచ్.. కనీసం ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇప్పించాలని కోరారు. అయితే పర్మిషన్ ఇప్పించే అధికారం తనకు లేదని కలెక్టర్ వెల్లడించారు. ప్రజల డిమాండ్ ను సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.