1/70 చట్టం పట్టని అధికారులు

1/70 చట్టం పట్టని అధికారులు

షెడ్యూల్డ్ ఏరియా భూ బదలాయింపు నిబంధనలు -1959 చట్టం మార్చి 4, 1959న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో  అమలులోకి వచ్చింది. ఈ చట్టం వచ్చి నేటికి 65 సంవత్సరాలు పూర్తి అయింది. కానీ అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ చట్టం వల్ల గిరిజనుల భూములు, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములు కూడా కాపాడబడతాయి.

1959లో ఈ భూ బదలాయింపులు నిబంధనలు చేశారు.  భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 క్లాస్ (1) ప్రకారం గుర్తించబడిన 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో  ఉమ్మడి అంధ్రప్రదేశ్​లో ఉమ్మడి  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు,  తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్  జిల్లాలలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాలలో ఈ చట్టం అమలులో ఉంది. ఈ చట్టం తెలంగాణ ప్రాంతంలో 1963 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్ట నియమాలను 1969 లో రూపొందించారు.  కీలక సవరణ 1970లో జరిగింది  కనుక  ఈ చట్టం 1/ 70 చట్టంగా ప్రాచుర్యంలో ఉంది. 

గిరిజనేతరుల స్థిరాస్తులు చట్టవ్యతిరేకం

రెండు రకాల బదలాయింపులతో అభ్యంతరాలు వస్తాయి. 1. గిరిజనుడి నుంచి గిరిజనేతరుడికి ఆస్తులు పోయినప్పుడు, 2. గిరిజనేతరుల నుంచి గిరి జనేతరులకు ఆస్తులు పోయినప్పుడు  చట్టవిరుద్ధం అవుతాయి. గిరిజనేతరుడు నుంచి  గిరిజనేతరుడు కి కూడా భూములు కొనడానికి వీలు లేదని 1/70 సవరణ వచ్చింది.  అంతేకాదు 1996లో సుప్రీంకోర్టు వారు సమత జడ్జిమెంట్  ఏమిటంటే ప్రభుత్వం కూడా గిరిజనేతరులకు లీజులు లేదా అసైన్మెంట్ చేయడానికి వీలులేదని తీర్పునిచ్చింది. 

కోనేరు కమిటీ చెప్పినా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2005 -– 06లో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కోనేరు రంగారావు ఆధ్వర్యంలో భూమి కమిటీని నియమించారు. అందులో తెలంగాణలోని గిరిజనుల భూమి సమస్యల కోసం జేఎం గిరిగ్లాని  కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీని ఫలితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక జీవోలు సర్క్యులర్లు ప్రభుత్వం తీసుకువచ్చింది కానీ ఆ సమస్యలు అలానే ఉన్నాయి.

ప్రమాదంలో గిరిజన ఆస్తులు

ఏజెన్సీ ప్రాంతంలోకి మైదాన ప్రాంత గిరిజనులు గిరిజన ఇతరుల వలసలు పెరగడంతో ఏజెన్సీ ప్రాంత భూములు అన్యాక్రాంతం అవ్వటం, రజాకర్ ఉద్యమ సమయంలో ఖాళీ చేయబడిన ఐదో షెడ్యూల్ గ్రామాలు భూములన్ని కూడా వలస గిరిజన ఇతరుల చేతుల్లో మగ్గి ఉన్నాయి. టైగర్ జోన్లు ( కావ్వాలా, పాకాల, ఏటూర్ నాగారం, నల్లమల, కాగజ్ నగర్), ప్రాజెక్టులు కొమరం భీం, పోలవరం వల్ల ఐదో షెడ్యూల్ గ్రామాలన్నీ చాలా వరకు ఖాళీ చేయబడ్డాయి. 

భూములన్నీ ఆదివాసీ గిరిజనులు కోల్పోవడం జరిగింది. నిజామ్ ఆర్మీకి ఇచ్చిన జంగుసిపాయి పట్టా భూములు వలస గిరిజనేతరుల  చేతుల్లో ఉన్నాయి.  అసైన్మెంట్ భూములను ప్రభుత్వం గిరిజనేతరులకు పట్టా ఇవ్వటం వల్ల ఆదివాసులకు అన్యాయం చేసినట్లయింది. బిల్ నెంబర్ ( బెల్ మత్త)  భూములు గిరిజనేతరుల చేతిలో ఉన్నాయి. సాదా బైనమా పేరుతో తెల్ల కాగితాల మీద ఒప్పందాలను చేసుకొని గిరిజనుల భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారు.  ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో కమర్షియల్, పరిశ్రమలు నెలకొల్పటానికి అవకాశం లేదు. కానీ,  అనేక పరిశ్రమలు వచ్చాయి.

గిరిజనేతరుల వలసలు

గోదావరి నదీ తీర ప్రాంతాలలో వలస గిరిజనేతరులు గిరిజన అమ్మాయిలను రెండో పెండ్లి చేసుకొని భూములను కొల్లగొట్టారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న దేవుని మాన్యాలు -  భూములన్నీ కూడా వలస గిరిజనేతరులు ఆక్రమించారు.   ఈ సమస్యలను గుర్తించిన కోనేరు రంగారావు కమిటీ ఏజెన్సీలోకి వలసను నిరోధించాలని, LTR కోర్టులు నిరంతరం జరగాలని,  రెవెన్యూ అధికారులకు ఏజెన్సీ చట్టలపై అవగాహన కల్పించాలని  అనేక సూచనలను చేయటంతో ప్రభుత్వం చాలా సర్క్యులర్లు,  జీవోలు ఇచ్చారు. కానీ అమలుకు నోచుకోవటం లేదు.

ఐటీడీఏలు పాలన శూన్యం

కొత్త జిల్లాల పేరుతో 5వ షెడ్యూల్లో భూ భాగాన్ని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేస్తూ విభజన చేయడం జరిగింది. దీనితో ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏలు ఉన్నా పరిపాలన శూన్యంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ధరణిపై అవగాహన లేకపోవడం వల్ల తమ తాత, ముత్తాతల పేర్ల మీద ఉన్న భూములను కూడా తమ పేర్ల మీద మార్చుకోలేని పరిస్థితి ఉంది.  

కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలి

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రజల ప్రభుత్వం  ఏజెన్సీ ప్రాంతంలోని భూ సమస్యల పరిష్కారం  కోసం  ఏజెన్సీ ప్రాంతంలోని  పని చేస్తున్న రెవెన్యూ కోర్టుల స్థానంలో నిరంతరంగా పనిచేసే ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించి భూ సమస్యలకు పరిష్కారం చూపించాలి. అలాగే, 1/70 చట్టాన్ని పకడ్బందీగా 
అమలు చేయాలని కోరుకుంటున్నాం.

గిరిజనుల స్థిరాస్తులకు చట్టబద్ధత

సెక్షన్ - 3  ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నచోట అక్కడి అన్ని స్థిరాస్తులు  కేవలం గిరిజనులు కానీ లేదా  గిరిజనులు మెంబర్లుగా ఉన్న ఏదైనా సొసైటీ  మాత్రమే గిరిజన ప్రాంతంలో భూములు పొందటానికి అవకాశం ఉంది. అందుకు భిన్నంగా ఎవరైనా గిరిజనేతరులు ఆస్తులు పొందినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. ఏజెన్సీ  ప్రాంతాల్లో 3 రకాల బదలాయింపు సాధ్యమవుతాయి. 1. ఒక గిరిజనుడు నుంచి మరొక గిరిజనుడికి ఆస్తి బదలాయింపు 2. ఒక గిరిజనేతరుడు నుంచి గిరిజనుడికి లేదా గిరిజనులతో కూడిన సొసైటీ కి భూ బదలాయింపు. 3. ఏజెన్సీలో  ఒక గిరిజనేతరుడుకి హక్కువుంటే వంశపరంగా తమ వారసులకు మాత్రమే భూ బదలాయింపు చేయవచ్చు.


- వాసం ఆనంద్ కుమార్,
ఆదివాసి అడ్వకేట్స్ అసోసియేషన్