బాసరలో నేడే వసంత పంచమి వేడుకలు

  • ముస్తాబైన జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్​
  • పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామారావు పటేల్​
  • దేశం నలుమూలల నుంచి తరలిరానున్న భక్తులు
  • ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

భైంసా, వెలుగు: వసంత పంచమి వేడుకలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం ముస్తాబైంది. బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించనుండగా.. ఇప్పటికే ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయం రంగురంగుల విద్యుద్దీపాల మధ్య శోభాయమానంగా వెలిగిపోతోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు.

వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ విజయరామారావు తెలిపారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానుండగా.. ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ కాంతిలాల్​ పాటిల్​ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి చెందిన టీటీడీ వసతి గృహం మరమ్మతుల్లో ఉన్నందున.. అధికారులు కోటి గాజుల మండపం వద్ద తాత్కలిక షెడ్లను ఏర్పాట్లు చేసి ఉచితంగా వసతి కల్పించే ఏర్పాట్లు చేశారు.

వీఐపీ పాస్​ల రద్దు

వేకువజామున నుంచే భక్తుల రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో అక్షరాభ్యాస మండపంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ఈసారి వీఐపీ పాస్​లను రద్దు చేసి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆలయం తరఫున పాలు, పండ్లు పంపిణీ చేయనున్నారు.

క్యూలైన్​లలో నిరీక్షించే భక్తులకు తాగునీరు అందించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ముథోల్ ​సీఐ మల్లేశ్, ఎస్​ఐ గణేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. రైల్వేస్టేషన్, గోదావరి నది స్నాన ఘట్టాలు, బస్టాండ్ ​తదితర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఆలయంలో అక్షరాభ్యాస మండపం, గర్భగుడి, ప్రధాన ద్వారం, టికెట్ల కౌంటర్, లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్​ వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు.

గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంలో ప్రయివేట్ లాడ్జీలన్నీ నిండిపోయాయి. యజమానులు ఒక్క రోజుకు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు అద్దె తీసుకుంటున్నారు. దీంతో సామాన్య భక్తులు రోడ్డు పక్కనే నిద్ర చేయాల్సిన పరిస్థితి ఉంది.

కొత్త ప్రభుత్వం తరఫున..

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ప్రభుత్వం ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ కలిసి సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రామారావు పటేల్​ఆలయ అధికారులను అప్రమత్తం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.