భైంసా/బాసర, వెలుగు: చదువుల తల్లి క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం, మన పంచాంగం ప్రకారం వసంత పంచమి కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారి పిల్లలకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు.
రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసి కూడా తగు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. భక్తులు నిర్వహణ సరిగా లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో తాగునీటికి బదులు కుళాయి నీటిని సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నిర్మాత దిల్ రాజు అమ్మవారిని దర్శించుకొని తన కుమారునికి అక్షరాభ్యాస పూజలు చేశారు.
పట్టువస్త్రాలు సమర్పించనున్న కలెక్టర్
వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం కూడా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక బృందం తెలిపింది. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ రావడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే పద్మశాలి సత్రం ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసిన చీరలను సరస్వతి, మహంకాళి అమ్మవారికి సమర్పించనున్నారు.