సర్‌‌‌‌ప్రైజ్‌‌తో పాటు షాక్ అయ్యా.. గతంలో నేనెప్పుడూ ఇలాంటి పాత్ర పోషించలే: వశిష్ట సింహా

 సర్‌‌‌‌ప్రైజ్‌‌తో పాటు షాక్ అయ్యా.. గతంలో నేనెప్పుడూ ఇలాంటి పాత్ర పోషించలే: వశిష్ట సింహా

ఓదెల రైల్వే స్టేషన్’తో విలన్‌‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు వశిష్ట సింహా.. ఈ మూవీకి సీక్వెల్‌‌గా వచ్చిన ‘ఓదెల 2’తోనూ మెప్పించాడు.  తమన్నా మెయిన్‌ లీడ్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో, అశోక్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులోని తన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందంటూ వశిష్ట సింహా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘-సంపత్ నంది గారు ‘ఓదెల 2’ ఐడియా చెప్పాక సర్‌‌‌‌ప్రైజ్‌‌తో పాటు షాక్ అయ్యాను. చాలా కొత్తగా అనిపించింది.  గతంలో నేనెప్పుడూ ఇలాంటి పాత్ర పోషించలేదు. 

తప్పకుండా ఈ పాత్ర చేయాలనిపించింది. ఇందుకోసం వర్కవుట్స్ మానేసి బరువు పెరిగాను. కాస్త టాన్ అయ్యాను. ప్రోస్తటిక్ మేకప్ వేసుకున్నా. ఈవిల్ క్యారెక్టర్ కనుక స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశాను. అది నా పాత్రకు చాలా ప్లస్‌‌ అయింది. ఇందులోని సీన్స్‌‌లో నేను ఉన్నా, లేకపోయినా నా నామస్మరణ సినిమా అంతా ఉంది.  నిజానికి ఈ కథకు కథానాయకుడు ఎవరైనా ఉంటే అది తిరుపతి పాత్రే. ప్రేక్షకుల నుంచి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కాల్స్, చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి’ అని చెప్పాడు.