అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆమె పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. వైసీపీకి రాజీనామ చేసిన వాసిరెడ్డి పద్మ తన రాజీనామా లేఖలో నేరుగా పార్టీ అధినేత జగన్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. ‘‘పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు’’ అని వాసిరెడ్డి పద్మ జగన్పై విమర్శల దాడికి దిగారు. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలాచాలానే అనేసి ఆమె వైసీపీ నుంచి తప్పుకున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ లేఖలో ఏముందంటే..
పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు ‘‘గుండె బుక్’’. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు. జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు.
Also Read : హైదరాబాద్ ఇండియాలో బెస్ట్ సిటీ
పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు. పరిపాలన చేయడంలో బాధ్యత లేదు. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు.
అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసింది.
వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశాను. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది YCPను వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను.