గుర్తింపు సంఘం కాలపరిమితి  నాలుగేండ్లు ఉండాల్సిందే : వాసిరెడ్డి సీతారామయ్య

గుర్తింపు సంఘం కాలపరిమితి  నాలుగేండ్లు ఉండాల్సిందే : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేండ్లు ఉండాల్సిందేనని ఆ సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టంచేశారు. గోదావరిఖని భాస్కర్‌‌‌‌రావు భవన్‌‌‌‌లో బుధవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేండ్లు ఉండాలని కొన్ని సంఘాలు అంటున్నాయని, గతంలో నాలుగు నుంచి ఆరేండ్ల వరకు ఉన్నా నోరు మెదపని వారు ఇప్పుడు రెండేండ్లు ఉండాలనడం సరికాదన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం ఏఐటీయూసీ కట్టుబడి ఉందన్నారు.

ఎన్నికలు జరిగి ఏడు నెలల గడిచినా యాజమాన్యం ఇప్పటివరకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని, అయినా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదన్నారు. గనుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కారణం లేకుండా కార్మికులు, సూపర్‌‌‌‌వైజర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచ్‌‌‌‌ ఉపాధ్యక్షుడు మాదన మహేశ్‌‌‌‌, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఎంఏ.గౌస్, ఎస్‌‌‌‌.వెంకట్‌‌‌‌రెడ్డి, దొంత సాయన్న, పి.నాగేందర్, గుర్రం ప్రభుదాస్, బలుసు రవి, తొడుపునూరి రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.