కోల్బెల్ట్, వెలుగు: కార్మిక వర్గానికి అండగా ఉంటూ వారి హక్కుల కోసం చేస్తున్న పోరాటాల ఫలితంగానే కార్మికులు ఏఐటీయూసీని సింగరేణి గుర్తింపు సంఘంగా గెలిపించారని ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘంగా గెలిచిన నేపథ్యంలో గురువారం సాయంత్రం మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో 2 వేల మెజార్టీతో గెలిపించిన సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో యూనియన్ల మధ్య పోటాపోటీగా ప్రచారం చేసినా కార్మిక సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సింగరేణి గుర్తింపు సంఘంగా తమ యూనియన్ గెలిపించిన కార్మికవర్గానికి రుణపడి ఉంటామని, సింగరేణిలో కొత్త అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండి.అక్బర్ అలీ, బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, ఎ.ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శనం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, లీడర్లు పాల్గొన్నారు.