- యూనియన్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇస్తామంటూ
- కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శ
కోల్‌బెల్ట్,వెలుగు : సింగరేణిలో ఏఐటీయూసీ గెలిస్తేనే కార్మికులకు హక్కులు, సదుపాయాలు వస్తాయని ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం మందమర్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో సుదీర్ఘ పోరాటాలు చేసి హక్కులు సాధించిన చరిత్ర ఒక్క ఏఐటీయూసీకి మాత్రమే ఉందన్నారు.
ప్రభుత్వ సంఘాలను గెలిపిస్తే సంస్థను ప్రభుత్వానికి తాకట్టుపెడతారని, కార్మికుల హక్కులు, సంక్షేమం ఉండదని ఆయన పేర్కొన్నారు. కొత్త అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులు, కొత్త ఉద్యోగాలు కల్పించడం తమతోనే సాధ్యమన్నారు. తమ యూనియన్ ను గెలిపిస్తే కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు ఇప్పిస్తామని, కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం మంజూరు అయ్యేలా చేస్తామని, పెర్క్స్‌పై ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం ఎవరి దారి వారిదే అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేశామని, యూనియన్ ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు తెలుపుతామని అప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. సింగరేణిలో ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు.
యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల జోక్యం ఉండకూడదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని దివాళా తీయించిందని, సంస్థను ఏటీఎంల వాడుకున్నదని ఆయన మండిపడ్డారు. లాభాల్లో ఉన్న సింగరేణి.. కార్మికుల జీతాల కోసం అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చుక్క గుర్తుకు ఓటు వేసి ఏఐటీయూసీని గెలిపించాలని కార్మికులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సలెంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శనం, సొమిశెట్టి రాజేశం తదితరులు పాల్గొన్నారు.