- ఇక వెస్ట్ గేట్ నుంచి సీఎం ఎంట్రీ
- నార్త్ ఈస్ట్ గేటు నుంచి బయటికి..
- లోపలి వైపు మరిన్ని వాస్తు చేంజెస్
- సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా అధికారుల రాకపోకలు
హైదరాబాద్: సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోకి ప్రవేశించే వారు. ఇకపై వెస్ట్ గేట్(పశ్చిమ ద్వారం) నుంచి రేవంత్ రెడ్డి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. నార్త్ ఈస్ట్ (ఈశాన్య) గేటు నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. సౌత్ ఈస్ట్ గేట్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు సాగిస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయిస్తున్నారు. వీటితోపాటు సెక్రటేరియట్ లో మరికొన్ని వాస్తు మార్పులు చేయిస్తున్నారు.
9వ అంతస్తులో సీఎంవో
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవో ఆరో అంతస్తులో కొనసాగింది. ఆయన లక్కీ నంబర్ ఆరు కావడంతో బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లతో సీఎంవోను కట్టించుకున్నారు. ప్రస్తుతం రేవంత్ సర్కారు సీఎంవోను తొమ్మిదో అంతస్తుకు మార్చుతోంది. రేవంత్ రెడ్డి లక్కీ నంబర్ 9 కావడంతోనే ఈ మేరకు మార్పులు చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని మార్పులు కూడా చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అక్కడి నుంచే పరిపాలన కొనసాగబోతోంది. ఆర్థిక సంబంధశాఖల కార్యాలయాలకూ మార్పలు చేసే అవకాశం ఉంది. సెక్రటేరియట్ బిల్డింగ్స్ శాఖ ఈ పనుల పర్యవేక్షిస్తోంది.
గతంలో గాంధీభవన్ లోనూ.
సీఎం రేవంత్ రెడ్డి వాస్తును, దేవుడిని విశ్వసిస్తారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా గాంధీభవన్ లో వాస్తు మార్పులు చేయించారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఇంటి ఆవరణలో చండీయాగం చేయించారు. ఈ రెండింటి తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు తాను ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాలనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు, తన జాతక చక్రానికి అనుగుణంగా వాస్తు మార్పులు చేయిస్తున్నారని తెలుస్తోంది.