
చాలామందికి వాస్తుపై అనుమానాలు వస్తుంటాయి. షాపు షట్టర్ కు రెండు వైపులా రోడ్డు ఉండొచ్చా... స్టోర్ రూం ఎక్కడ ఉండాలి ... ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. . .
ప్రశ్న: షట్టర్ తో ఏర్పాటు చేసిన గదికి రెండు వైపులా రోడ్డు ... అంటే దక్షిణ, తూర్పు దిక్కుల్లో షట్టర్స్ (ద్వారాలు) ఉన్నాయి. అలాగే రోడ్లు కూడా తూర్పు, దక్షిణ దిక్కుల్లో ఉన్నాయి. వాస్తు ప్రకారం ఇది కరెక్టేనా? వాస్తు డోర్ ఎటువైపు ఉంటే ఉండాలి.
జవాబు: వాస్తు ప్రకారం రెండు వైపులా రోడ్లు ఉన్న దిక్కుల్లో వ్యాపారం చేస్తే గ్రోత్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఏదో ఒక దిక్కు అంటే.. దక్షిణం, తూర్పు దిక్కు క్లోజ్ చేసుకుని, ఇంకోవైపు వాడుకుంటే మంచిది.
ప్రశ్న: ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడో ఒకసారి వాడే సామాన్లు ఉంటాయి. మళ్లీ ఎప్పుడో వాడతాం... మహా అయితే ఏడాదికి ఒకసారో.. రెండు సార్లో వాడతాం.. ఆ తరువాత వాటిని ఇంట్లో ఉండే అటుకపైనో.... స్టోర్ రూంలో పెట్టుకుంటారు. ఇంట్లో స్టోర్ రూం ఏ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి.
జవాబు: ఇంట్లో ఉండే హాల్లో చిన్న స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలంటే నైరుతి దిక్కులో కట్టుకోవచ్చు. దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ వల్ల బరువు పెరిగినా వాస్తు ప్రకారం ఎలాంటి సమస్యా ఉండదు..
ప్రశ్న: అన్నదమ్ములం ఇద్దరం చెరోవాటాలో ఉంటున్నప్పుడు .. నాలుగు దిక్కుల్లో ఎవరు .. ఏవైపు వాటా తీసుకుంటే బాగుంటుంది?
జవాబు: అన్నదమ్ములు వేరువేరుగా ఉండాలనుకున్నప్పుడు వాస్తును ఫాలో అవ్వాలి. తూర్పు వాటాలో చిన్నవాళ్లు, పడమర దిక్కు పెద్దవాళ్లు ఉండాలి. ఉత్తరం దిక్కు చిన్నవాళ్లు, దక్షిణ దిక్కు పెద్దవాళ్లు ఉండాలి. అది కూడా రెండిళ్లమధ్య కాంపౌండ్ వాల్ కట్టుకుంటే మంచిది. ఉత్తరం.. తూర్పు దిక్కులో రోడ్డు ఉంటే, ఉత్తర ముఖంగా ఇల్లు కట్టుకోవాలి.
ప్రశ్న: బ్రహ్మస్థానంలో పిల్లర్ ఉంటే వాస్తుప్రకారం మంచిదేనా..? దానితోపాటే గోడ .. ఆ పక్కనే దేవుడి పూజగది ఏర్పాటు చేసుకుంటే దోషమా? ఇలా ఉన్నప్పుడు పరిష్కారం ఏమైనా ఉందా?
జవాబు: బ్రహ్మస్థానం అంటే ఇంటి మధ్య ఉండే స్థలం. అయితే, అది ఏదిక్కులో ఉందో చూడాలి. బ్రహ్మస్థానంలో పిల్లర్ ఏ గోడకు ఉన్న దిక్కులో ఉందనే దాన్నిబట్టి సరైన సూచన ఇవ్వొచ్చు. దేవుడి పూజ గది తూర్పు వైపు ఉండాలి. దేవుడు పడమర దిక్కు చూస్తుండాలి. తూర్పు వైపు చూస్తూ పూజ చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు-పడమర దిక్కుల్లో పూజ గది ఉంటేనే మంచిది.
-వెలుగు,లైఫ్-