సొంత ఇల్లు అయినా.. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నా వాస్తు అనేది ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి వాస్తుకు సంబంధించిన కొంత సమాచారం.. నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం..
అక్కడ ఫొటోలు పెడితే..
ప్రశ్న: ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు పెట్టుకోవచ్చా? అలా పెట్టుకుంటే నెగెటివ్ ఆలోచనలు వస్తాయని కొంతమంది చెప్పారు. ఇది ఎంతవరకు నిజం.
-శివకుమార్, నల్లగొండ
జవాబు: చనిపోయిన వాళ్లను దేవుళ్లతో సమానంగా భావిస్తాం. ఆత్మీయుల ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకమే. పెద్దల ఆశీర్వాదం ఉంటుందని అలా పెట్టుకుంటారు. ఫొటోలను పూజ గదిలో పెట్టకూడదు. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా పెట్టుకోవచ్చు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే దక్షిణం, లేదంటే పడమర దిక్కులో ఫొటోలు పెట్టాలి.
వాయువ్య దోషం ఉంటే..
ప్రశ్న: వాయువ్యం పెరిగినా, మూతపడినా, ఇంకేమైనా వాయువ్య దోషాలు ఉన్నా... వాటి నివారణకు ఏం చేయాలి?
-రాంబాబు, కరీంనగర్
జవాబు: వాయువ్య దోషాలు ఉండటం అంత మంచిది కాదు. దాని వల్ల ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు వస్తాయి. వాయువ్యం పెరిగితే... దాని కట్ చేసి విడగొట్టాలి. ఇంట్లో అలాంటి దోషం ఉంటే.. కొంత గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి. అపార్ట్మెంట్ అయితే పూర్తిగా సెపరేట్ చేసి సమాంతరంగా నిర్మాణం చేసుకోవాలి.
కన్నాలు మూసెయ్యాలా
ప్రశ్న: ఇంటి గోడలు కట్టేటపుడు తాపీ మేస్త్రీలు, పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు పెట్టేందుకు గోడలకు కన్నాలు వేస్తుంటారు. పని పూర్తవ్వగానే ఆ కన్నాలు మూసెయ్యాలా? లేకపోతే మంచిది కాదా? -
సురేశ్, ఇబ్రహీంపట్నం
జవాబు: కన్నాలు పూడ్చినా, పూడ్చకపోయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీనికి వాస్తు సమస్యలు అంటూ ఏవీ ఉండవు. పని పూర్తి కాగానే కన్నాలు మూసేస్తే చూసేందుకు బాగుంటుంది. అలా వదిలేయకుండా ఇటుక లేదా రాయితో గోడల కన్నాలు పూడ్చేయాలి.
మొక్కలు పెంచొద్దా...?
ప్రశ్న: మేము ఈ మధ్యనే ఇల్లుకట్టుకొని గృహప్రవేశం చేశాం. వాస్తు ప్రకారమే ఇంటిని కట్టుకున్నాం. తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలపై పూల చెట్లు పెంచొచ్చా? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
వెంకటేశ్, సిద్దిపేట
జవాబు: కొంతమంది ఊళ్లలో ప్రహరీ గోడలపై పూల మొక్కలు పెంచుతుంటారు. దాని వల్ల వాస్తు సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే పూల చెట్ల బరువు ఎక్కువ ఉండకూడదు. అయితే గోడపై ఉండే మొక్కలకు నీరు పెట్టడం. వల్ల గోడకు నిమ్ము వస్తుంది. దాంతో గోడలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
"వాస్తు'కు సంబంధించి మీ ప్రశ్నలను: దర్వాజ, వెలుగు దినపత్రిక, ప్లాట్ నంబర్ 13/A/B/C, ఎమ్మెల్యే ఎక్స్టెన్షన్ కాలనీ, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500034కు రాయొచ్చు. darwaja@v6velugu.comకు మెయిల్ చేయొచ్చు.
వాస్తు కన్సల్టెంట్
కాశీనాథుని శ్రీనివాస్
94400 88799
V6 వెలుగు, లైఫ్