డీజీపీ దాఖలు చేసిన అఫిడవిట్ అంశాలు పర్యవేక్షిస్తం

డీజీపీ దాఖలు చేసిన అఫిడవిట్ అంశాలు పర్యవేక్షిస్తం
  • వట్టె జానయ్య కేసులో సుప్రీంకోర్టు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: వట్టె జానయ్య కేసులపై తెలంగాణ డీజీపీ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాల అమలు తీరును పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్ట చేసింది. బీఆర్ఎస్ హయాంలో తనపై పోలీసులు ఒకే సారి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ వట్టె జానయ్య గతేడాది సెప్టెంబర్ 20 న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్, మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ కోరుతూ మొత్తం ఆరు స్పెషల్ లీవ్ పిటిషన్లు(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం (గత బీఆర్ఎస్ సర్కార్) తనపై ఒకేసారి అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపులు, దొంగతనం, దోపిడీ కేసులకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిందని ఇందులో పేర్కొన్నారు.

గత విచారణ సందర్భంగా  రాష్ట్ర డీజీపీ వర్చువల్ మోడ్ లో  ధర్మాసనం ముందు హాజరయ్యారు. మరోసారి ఎలాంటి పొరపాట్లు జరగనివ్వమని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీ వినతితో సంతృప్తి చెందని కోర్టు..ఈ అసమానతలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా వట్టె జానయ్య కేసులకు సంబంధించి డీజీపీ అఫిడవిట్ దాఖలు చేశారు. మంగళవారం మరోసారి వట్టి జానయ్య పై దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 రాష్ట్ర పోలీసుల తరఫున సీనియర్ అడ్వొకేట్ వాదిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జానయ్యపై నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌లు, తీసుకున్న చర్యలు, తదుపరి తీసుకోబోయే చర్యలపై సవివరంగా అఫిడవిట్  లో పొందుపరిచినట్లు కోర్టుకు తెలిపారు. ఈ అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. అలాగే అఫిడవిట్‌‌ను పరిశీలించి అందులో పేర్కొన్న అంశాల అమలు తీరును పర్యవేక్షిస్తామని వెల్లడించింది. విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.