సూర్యాపేట బీఆర్ఎస్లో బిగ్ ఫైట్

సూర్యాపేట బీఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంది. జిల్లా కేంద్రంలో వట్టె జానయ్య అనుచరులు ఆందోళనకు దిగారు. జానయ్యపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట గాంధీపార్క్ సెంటర్ నుంచి జనగాం చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. మంత్రి జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మతో జానయ్య అనుచరులు నిరసన చేపట్టారు. 

ఎన్నికల్లో తనపై పోటీ చేస్తాడనే భయంతో ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కేసులు ఎత్తివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్ని కేసులు పెట్టినా రానున్న ఎన్నికల్లో జానయ్య పోటీ చేయడం ఖాయమంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మంత్రి జగదీష్ రెడ్డిపై డీసీఎంఎస్‌ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా నా దగ్గర ఉందని వట్టె జానయ్య తెలిపారు. అవినీతిపై ప్రశ్నించేందుకే నాపై మంత్రి కేసులు పెట్టించారని ఆయన మండిపడ్డారు. త్వరలో మంత్రి అవినీతి చిట్టా బయటపెడుతానని జానయ్య హెచ్చరించారు.  బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని జానయ్య విమర్శించారు.