అక్రమ కేసులు పెట్టి..నన్ను చంపేందుకు కుట్ర : వట్టే జానయ్య

సూర్యాపేట, వెలుగు : బహుజనులను తొక్కేస్తున్నారని, తనపై అక్రమ కేసులు పెట్టి చంపేందుకు కుట్ర చేస్తున్నారని, బీఆర్ఎస్ నేత, డీసీఎంఎస్ చైర్మన్  వట్టే జానయ్య ఆరోపించారు. కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన ఓ వీడియో రిలీజ్​ చేశారు. ‘‘మనం కష్టపడి ఓటు వేయించి బానిస బతుకులు బతకాలా? స్వేచ్ఛలేని చోట ఉండడానికి మనసొప్పక పక్కకు పోదామనుకుంటే ఒకే రోజు 70 మందితో తప్పుడు కేసులు పెట్టించారు’’ అని ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, ఎవరికైనా అన్యాయం జరిగితే తనతో పాటు తన కుటుంబ సభ్యులు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగున్నరేండ్ల కింద ఊరు విడిచిపెట్టి వెళ్లిన వ్యక్తి, 21వ తేదీన హైదరాబాద్ లో తనతో పాటు యశోదా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తి చేపలు ఎలా దొంగిలిస్తారని ప్రశ్నించారు. 

ప్రజలు ఆశీర్వదిస్తే పోటీ చేస్తా అన్న రెండో రోజే తనపై పదుల సంఖ్యలో కేసులు పెట్టి జైల్లో వేసేందుకు కుట్ర చేశారన్నారు. కౌన్సిలర్ ఎన్నికల సమయంలో రూ.కోటి సుపారీ ఇచ్చి తనపై హత్యకు ప్లాన్  చేసిన ఉగ్గమ్  బుచ్చి రాములుతో తనపై అక్రమ కేసులు పెట్టించారని, దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసన్నారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని తెలంగాణ పోలీసులే స్వయంగా నిర్ధారించి గన్ మెన్ ను కేటాయించారని చెప్పారు. గాంధీ నగర్​లో మంత్రి జగదీశ్  రెడ్డి నిధులతో ప్రభుత్వ స్థలంలో బస్టాండ్​ నిర్మిస్తుంటే తన భూమి అని ఉగ్గం బుచ్చి రాములు కోర్టులో పిటిషన్​ వేస్తే మంత్రి జగదీశ్​రెడ్డి కలెక్టర్ తో విచారణ జరిపించి దాన్ని ప్రభుత్వ భూమిగా నిర్ధారించారన్నారు. అయినా కోర్టులో కేసు వేసి స్టే తెచ్చిన వ్యక్తితోనే తాను భూమి కబ్జా చేశానని కేసు పెట్టించారన్నారు.  

 ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. వాటికి సంబంధించిన ఆధారాలను నియోజకవర్గంలోని గడపగడపకూ పంపేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రజల్లో నన్ను దోషిగా, కబ్జాకోరుగా చిత్రీకరించి లబ్ధి పొందేందుకు చూస్తున్న వ్యక్తులను దేవుడు క్షమించడు. గాంధీ నగర్ భూముల విషయంలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిపై వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నాను. నాకు ఏమైనా జరిగితే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకుడు, పోలీసులదే బాధ్యత. నేను నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా” అని జానయ్య పేర్కొన్నారు.