- హైదరాబాద్ వెళ్తుండగా అర్ధరాత్రి అదుపులోకి..
- జానయ్య ఇంటిపై పోలీసుల దాడులు
- పలు డాక్యుమెంట్ల స్వాధీనం
- హైదరాబాద్‌లో జానయ్య పై కిడ్నాప్ కేసు
సూర్యాపేట, వెలుగు: డీసీఎంఎస్చైర్మన్వట్టే జానయ్య యాదవ్ కు మద్దతు తెలిపేందుకు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన మద్దతుదారులను ఆదివారం అర్ధరాత్రి నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో జానయ్యను కలిసేందుకు దాదాపు 100మంది వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు పీఎస్‌లో ఉంచారు. ఇందులో 40 మంది మహిళలుండగా, తమను అర్ధరాత్రి వేళలో మహిళా పోలీసులు లేకుండానే స్టేషన్ బయట ఉంచారని వాపోయారు. తమను ఎందుకు అరెస్ట్చేస్తున్నారని ప్రశ్నిస్తే బూతులు తిట్టారని బాధతులు ఆవేదన వ్యక్తం చేశారు. నార్కట్‌పల్లి పీఎస్నుంచి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి సోమవారం ఉదయం విడిచిపెట్టారు. మరోపక్క సూర్యాపేటలోని గాంధీనగర్‌లో ఉన్న జానయ్య ఇంట్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జానయ్య ప్రధాన అనుచరుడైన టీచర్పిల్లలమర్రి ఉపేందర్ ను సూర్యాపేటలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
జానయ్య కిడ్నాప్ చేశాడంటూ ఫిర్యాదు
డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై ఫిర్యాదు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 70 మంది వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయగా తాజాగా కూకట్ పల్లికి చెందిన దంపతులు మమత, చక్రవర్తి తమను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు కాజేశాడని జానయ్యతో పాటు ఆయన కొడుకు గణేశ్, అనుచరుడు వెంకట్ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమను సూర్యాపేట సమీపంలోని వజ్ర రైస్ ఇండస్ట్రీలో నిర్బంధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించారని, దీంతో భయపడి విడతల వారీగా రూ. 30లక్షలు చెల్లించామని చెప్పారు. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు. అయ్యప్ప మాలలో ఉండి జానయ్య అనుచరులు మమత, చక్రవర్తి ఉంటున్న బాలాజీ రెసిడెన్సీకి వచ్చిన వీడియోలను సైతం పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు జానయ్యపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. మరోవైపు గాంధీనగర్, పిల్లలమర్రి శివారులో జానయ్య, అతడి అనుచరులు తమ భూములను ఆక్రమించారని, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని శ్రీపతి చెన్నమ్మ, నాగయ్య, మధు,గార జయమ్మ, దానికెన స్వాతి సోమవారం జిల్లా కేంద్రంలో తెలిపారు. గాంధీనగర్ లో పేదలు, ఎస్సీల భూములు ఆక్రమించి వెంచర్లు వేశారని, ఫంక్షన్ హాల్ నిర్మించారన్నారు. అంజనాపురి కాలనీలో 200 గజాలున్న తమ ఇంటి స్థలంలో 100 గజాలు జానయ్య ఆక్రమించారని, అనుచరులను పంపి బెదిరించారని, తన భర్తను ప్రలోభపెట్టి తన ఇంటిని ఆక్రమించారన్నారు. తనకు ప్రాణహాని వుందని స్వాతి ఆరోపించారు. దళిత బహుజనులను బెదిరించి భూములు లాక్కుంటే ఊరుకోబోమని, వారికి అండగా నిలుస్తామని ఎంఆర్‌పీఎస్‌నాయకులు యాతాకుల రాజన్న అన్నారు.
పోటీలో నిలబడతా అన్నందుకే..
తన భర్త ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నందుకే మంత్రి జగదీశ్‌రెడ్డి పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని జానయ్య భార్య రేణుక ఆరోపించారు. తన భర్తను కలిసేందుకు వెళ్తున్న తనను, కుటుంబసభ్యులను అర్ధరాత్రి పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. స్టేషన్లో తమను ఇబ్బంది పెట్టారని వాపోయారు. తన భర్తకు ఏదైనా జరిగితే మంత్రి జగదీశ్‌రెడ్డిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.
9 కేసులు నమోదు చేశాం
జానయ్య పై ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఈనెల 20న ఉగ్గం బుచ్చిరాములును జానయ్యతో పాటు పిల్లల మర్రి ఉపేందర్ లైసెన్స్ తుపాకీతో బెదిరించి అతడి చేపల చెరువు నుంచి 5 టన్నుల చేపలను లూటీ చేసినట్లు తెలిపారు. ఉపేందర్ ను సోమవారం సూర్యాపేటలో అరెస్టు చేసినట్లు చెప్పారు. జానయ్య కు సంబంధించిన డాక్యుమెంట్లను గాంధీ నగర్ లోని ఇంటిలో స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు