- బీజేపీలో జాయిన్ అయ్యేందుకు హెడ్ ఆఫీస్ వెళ్లిన వట్టే జానయ్య
- తనను సంప్రదించకుండా పార్టీలో చేరికలపై సంకినేని అసహనం
- రాజీనామాకు సిద్ధపడిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- అర్ధరాత్రి అనుచరులతో అత్యవసర సమావేశం
- కిషన్ రెడ్డి బుజ్జగింపుతో వెనక్కు తగ్గిన వెంకటేశ్వరరావు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా బీజేపీలో ముసలం రేగుతున్నది. బీజేపీ రాష్ట్ర నాయకులు ఒంటెత్తు పోకడలతో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న ఆయనను సంప్రదించకుండా పార్టీలోకి వివాదాస్పద వ్యక్తులను జాయిన్ చేర్చుకుంటున్నారని రాష్ర్ట నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అర్ధరాత్రి తన అనుచరులతో అత్యవసర సమావేశమై బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధం కావడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందారు.
బీజేపీలో చేరేందుకు హెడ్ ఆఫీస్ కు వెళ్లిన వట్టే జానయ్య..
మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో విభేదించి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరిన జానయ్య ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల బీఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చేరేందుకు ఆ పార్టీ హెడ్ ఆఫీస్ కు జానయ్య వెళ్లారు. చివరికి ఆయన బీజేపీలో చేరకుండానే వెనుదిరిగారు.