కులగణన చేపట్టడం బీసీ సంఘాల విజయమే : వట్టే జానయ్యయాదవ్

కులగణన చేపట్టడం బీసీ సంఘాల విజయమే : వట్టే జానయ్యయాదవ్
  • డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్ 

సూర్యాపేట, వెలుగు :  ప్రభుత్వం కులగణన చేపట్టిందంటే.. అది బీసీ సంఘాల విజయమేనని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. ఈనెల 27న జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలోని గాంధీ నగర్ లో  శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టిందన్నారు. బీసీలను 42 శాతం  చూపించడంతో బీసీ జేఏసీ, బీసీ సంఘాల పోరాటం ఫలితంగానే ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టిందని చెప్పారు.

బీసీల్లో విప్లవం రాబోతుందని, ఎన్నికల్లో అన్ని పార్టీలు పావులుగా వాడుకొని మోసం చేస్తున్నాయని విమర్శించారు. బీసీలకు ఏడాదికి రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు రూ.10 లక్షలు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు చాంద్ పాషా, కుంభం నాగరాజు, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య, కుంభ వెంకన్న, వట్యాల శేఖర్, బడుగుల నాగార్జున, జానకీరాములు, సుమన్, పంతులు తదితరులు పాల్గొన్నారు.